ISRO Satellites: రాబోయే మూడేళ్లలో ఉపగ్రహాల సంఖ్య మూడింతలు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సరికొత్త లక్ష్యాలతో దూసుకుపోతోంది. భవిష్యత్తులో అంతరిక్ష రంగాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తున్న భారత్, రాబోయే మూడు నాలుగేళ్లలో తమ ఉపగ్రహాల సంఖ్యను (ISRO Satellites) ఏకంగా మూడు రెట్లు పెంచనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార వ్యవస్థల కేంద్రం (ఇన్కాయిస్ – INCOIS) 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఇస్రో భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. 2042 నాటికి భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడమే ఇస్రో తదుపరి అతిపెద్ద లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని’ (Space Station) నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇన్కాయిస్ అందిస్తున్న సేవలను (ISRO) నారాయణన్ కొనియాడారు. గత 27 ఏళ్లలో ఇన్కాయిస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి సంస్థగా ఎదిగిందని ప్రశంసించారు. ముఖ్యంగా సునామీ, తుఫాను హెచ్చరికలు జారీ చేయడంలో, సముద్ర వాతావరణ మార్పులను అంచనా వేయడంలో, మత్స్యకారులకు చేపల లభ్యత గురించి కచ్చితమైన సమాచారం అందించడంలో ఇన్కాయిస్ పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సముద్ర సమాచార సేవల కోసం ఇన్కాయిస్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘జెల్లీ ఏఐఐపీ’, ‘సముద్ర 2.0’, ‘శివాస్’ (SHIVAS) మొబైల్ యాప్లను ఆయన లాంచ్ చేశారు. ఈ వేడుకల్లో ఇస్రో (ISRO), ఇన్కాయిస్ డైరెక్టర్లతో పాటు స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













