పాన్ ఇండియా కాదు.. మంచి కథే ముఖ్యం!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పాత్రలపై తరచూ డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నటి మాళవిక మోహనన్(Malavika Mohanan) చేసిన కామెంట్స్ మరోసారి ఆ అంశాన్ని ముందుకు తెచ్చాయి. మహిళా పాత్రలకు మరింత బలం రావాలంటే కెమెరా ముందు మాత్రమే కాదు, కెమెరా వెనుక కూడా మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళా రచయితలు, డైరెక్టర్లు ఎక్కువ సంఖ్యలో సినీ రంగంలోకి వస్తే మహిళా పాత్రల ఆలోచనా విధానం, ప్రాధాన్యం మరింత సహజంగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. అప్పుడు మాత్రమే మహిళల చుట్టూ తిరిగే శక్తివంతమైన యాక్షన్ కథలు కూడా భారతీయ సినిమాల్లో ఎక్కువగా కనిపించే అవకాశముందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా అనే ట్యాగ్ కంటే సినిమా కంటెంట్‌నే ప్రేక్షకులు ఎక్కువగా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక సినిమా ఏ భాషలో రూపొందిందన్నది కాకుండా, అది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందన్నదే దాని పరిధిని నిర్ణయిస్తుందని ఆమె అన్నారు. మంచి కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటే భాషా సరిహద్దులను దాటి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోవడం కచ్ఛితంగా జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే తాను కథకు ప్రాధాన్యమిచ్చే సినిమాలనే ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆసక్తిని ఆమె వ్యక్తం చేశారు. కమర్షియల్ సినిమాల్లో భాగమవుతూనే, నటిగా తన టాలెంట్ ను చూపించే పాత్రలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఫ్యూచర్ లో మహిళా పాత్రలను కేంద్రంగా చేసుకుని తెరకెక్కే పెద్ద స్థాయి సినిమాలు మరింత పెరగాలని, అలాంటి మార్పు భారతీయ సినీ పరిశ్రమకు కొత్త దిశను చూపుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.








