New Airports: ఐదేళ్లలో కొత్తగా 50 ఎయిర్‌పోర్టులే లక్ష్యం: కేంద్రం
దేశంలో విమానయాన, రియల్ ఎస్టేట్ రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 50 విమానాశ్రయాలను (New Airports) అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన ‘నేషనల్ అర్బన్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కాన్క్లేవ్ 2026’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లలో భారత్ ఒకటని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 165 విమానాశ్రయాలు (New Airports) పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నాయని, సగటున ప్రతి 33 రోజులకు ఒక కొత్త ఎయిర్పోర్ట్ లేదా టెర్మినల్ నిర్మాణం పూర్తవుతోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
కొత్త విమానాశ్రయాల (New Airports) ఏర్పాటు అనేది రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బలమైన పునాది లాంటిదని, ఇది నగరాల రూపురేఖలను మార్చేస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయాల సమీపంలో నిర్మించే భవనాల ఎత్తుకు సంబంధించిన ఆంక్షలపై డెవలపర్లకు ఉన్న సమస్యలను విమాన భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పరిష్కరించేందుకు తమ శాఖ కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోనుందని, 2030 నాటికి దీని విలువ 1 ట్రిలియన్ డాలర్లకు, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి ఏకంగా 5 నుంచి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.













