Revanth Reddy : రేవంత్ రెడ్డికి తిరుగుందా..?
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రస్థానం ఒక ప్రభంజనంలా సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఒక ఎత్తయితే, ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ జైత్రయాత్రను కొనసాగిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం రేవంత్ రెడ్డి సత్తాకు నిదర్శనం. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంటుందనే నానుడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా దాదాపు అలాగే ఉన్నాయి. కానీ, రేవంత్ రెడ్డి ఆ సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకుని పల్లెల్లో పట్టు నిరూపించుకున్న కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 70 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. అంటే, అటు పల్లె ప్రజలు, ఇటు పట్టణ వాసులు కూడా రేవంత్ రెడ్డి పాలనపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. ఇది కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు లభించిన మద్దతు అని చెప్పొచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64 సీట్ల స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ప్రతిపక్ష బిఆర్ఎస్ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని విమర్శలు చేసింది. సొంత పార్టీలో కూడా సీనియర్ మంత్రుల మధ్య రేవంత్ ఎలా నెట్టుకొస్తారనే సందేహాలు ఉండేవారు. కానీ, రేవంత్ తనదైన శైలిలో అడుగులు వేశారు. వరుస విజయాలతో ఆ అభద్రతా భావాన్ని పటాపంచలు చేశారు. ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చారు. ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తాన ప్రభావం ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఈ విజయాల పరంపరతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అత్యంత సుస్థిరంగా మారింది. బిఆర్ఎస్ నుంచి వలస వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీ బలం పెరగడమే కాకుండా, రేవంత్ నాయకత్వానికి పార్టీలో ఎదురులేకుండా పోయింది.
మున్సిపల్ ఎన్నికల విజయంతో ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి పరపతి అమాంతం పెరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఆయన మాటకు ఇప్పుడు తిరుగులేని గౌరవం దక్కుతోంది. వరుసగా ఎన్నికలను గెలిపిస్తూ, పార్టీకి నిధులు, క్యాడర్ బలంతో పాటు విజయాలను అందిస్తుండటంతో, రేవంత్ రెడ్డి ఇప్పుడు హైకమాండ్ నమ్మకస్తుడిగా మారారు. ఇది ఆయనకు పాలనాపరంగా మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ప్రసాదించింది. 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే, 68 చోట్ల కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించడం రేవంత్ ముద్రకు నిదర్శనం.
ఈ ఎన్నికల్లో కేవలం ముఖ్యమంత్రే కాకుండా, మంత్రులందరూ కూడా తమ తమ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పార్టీని గెలిపించుకుని పాస్ అయ్యారు. రేవంత్ రెడ్డి అందరినీ సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే ఊపును కొనసాగించేలా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు ‘ముఖ్యమంత్రిగా ఆయన సరిపోతారా?’ అన్నవారి నోళ్లే ఇప్పుడు ‘రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్కు దొరికిన అసలైన మొనగాడు’ అని మెచ్చుకునేలా చేశారు. ఈ విజయంతో రేవంత్ రెడ్డి కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా, తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక శక్తివంతమైన అధ్యాయంగా నిలుస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, ఎన్నికల రణక్షేత్రంలో అజేయుడిగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల విజయంతో తన రాజకీయ ప్రస్థానంలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించారు.













