Revanth Reddy: రేవంత్ మాయలో పడ్డ కారు..?
తెలంగాణ(Telangana)లో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురు కావడంతో ఇప్పుడు గులాబీ పార్టీలో మదనం మొదలైంది. ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందని కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ఆ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక సీటు కూడా పార్లమెంట్లో లేకపోగా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమిపాలైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో గులాబీ పార్టీ సరైన వ్యూహాలు రచించలేదు అనే విమర్శలు కూడా వచ్చాయి.
అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో సైతం పార్టీ సత్తా చాట లేకపోవడం ఆందోళన కలిగించింది. బలంగా ఉన్న జిల్లాలో కూడా పార్టీ క్యాడర్ అనుకున్న స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయింది. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులుగా పనిచేసిన వారి నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఓటమి పాలు కావడం అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీ ఒకప్పుడు బలంగా కనపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఈ జిల్లాలో పూర్తిగా గులాబీ పార్టీ కనుమరుగైన పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క మున్సిపల్ స్థానాన్ని కూడా ఆ పార్టీ కైవసం చేసుకో లేకపోయింది.
ఇవి కూడా చదవండి
నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది. నిజామాబాద్ జిల్లాలో కూడా పార్టీ ఖాతా తెరవలేదు. 116 స్థానాల్లో ఎన్నికలు జరిగితే కేవలం 13 స్థానాల్లో మాత్రమే పార్టీ విజయం సాధించడం పట్ల అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక కారణాలేంటి అనేది పక్కన పెడితే నాయకులను మార్చాల్సిందే అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. పార్టీ నేతలు అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లడమే మినహా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం మినహా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన కేడర్లో వ్యక్తం అవుతుంది. ఎంతసేపు అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నం చేయడం మినహా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోవడాన్ని కేడర్ జీర్ణించుకోవడం లేదు. కనీసం ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా పార్టీ బలంగా ప్రభావం చూపించలేకపోవడాన్ని కేడర్ తప్పుపడుతోంది.
ఇవి కూడా చదవండి













