BRS: మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్కు వేకప్ కాల్..!?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారత్ రాష్ట్ర సమితి (BRS)ని ఆత్మరక్షణలో పడేలా చేశాయి. “అధికార పక్షంపై వ్యతిరేకత ఉంది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. గులాబీ జెండా మళ్ళీ రెపరెపలాడుతుంది” అని ఆ పార్టీ అభ్యర్థులు, నేతలు చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో నీటి మూటగానే మిగిలిపోయింది. వెలువడిన ఫలితాలు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర నిరాశను మిగిల్చాయి.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తన హవాను కొనసాగించగా, బీఆర్ఎస్ మాత్రం ద్వితీయ స్థానానికే పరిమితమైంది. మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ సగానికి పైగా కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. బీఆర్ఎస్ కేవలం 770 వార్డులకే పరిమితం కావడం ఆ పార్టీ బలాన్ని గణనీయంగా తగ్గించినట్లయింది. హైదరాబాద్ చుట్టుపక్కల మినహా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ వైఫల్యానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ చొచ్చుకుపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. కానీ, ఉత్తర తెలంగాణ, ఉమ్మడి నల్గొండ వంటి ప్రాంతాల్లో పార్టీ గాలి తీసేసింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతమే ఇప్పుడు కూడా కొనసాగింది. అంటే, పార్టీ కొత్తగా ఓటర్లను ఆకర్షించలేకపోయింది. “ప్రభుత్వ వ్యతిరేక ఓటు” తమకే పడుతుందని ఆశించిన బీఆర్ఎస్ కు, ఆ ఓట్లు చీలిపోవడం లేదా కాంగ్రెస్ వైపు మొగ్గడం పెద్ద దెబ్బ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీని వీడటం కేడర్ లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నడిపించే నాథుడు కరువవ్వడం బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం.
ఇవి కూడా చదవండి
మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తే, బీఆర్ఎస్ కేవలం ‘గ్రేటర్ హైదరాబాద్’ పార్టీగా మారుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సిటీ శివారు మున్సిపాలిటీల్లో ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ, జిల్లాల్లోని పురపాలికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం…, కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం చూస్తుంటే బీఆర్ఎస్ కు తన సొంత ప్రాబల్యం ఉన్న చోట కూడా పట్టు తప్పుతోందని స్పష్టమవుతోంది.
అధికారంలో ఉన్న పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎడ్జ్ ఉండటం సహజమేనని బీఆర్ఎస్ నేతలు సరిపెట్టుకోవచ్చు. కానీ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వరుస విజయాలు సాధించడం అనేది కేవలం అధికార ప్రభావం మాత్రమే కాదు. కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారంటీలు, పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టిన దృష్టి ఓటర్లను ఆ పార్టీ వైపు తిప్పుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు కేవలం సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి నమ్మకాన్ని కలిగించడంలో విఫలమయ్యారనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట.
బీఆర్ఎస్ ఇకనైనా తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేస్తే సరిపోదని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. వార్డు స్థాయి నుండి కమిటీలను బలోపేతం చేయాలి. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం పార్టీకి మైనస్ అవుతోంది. కేవలం కేటీఆర్, హరీష్ రావులపైనే భారం వేయడం వల్ల జిల్లాల్లో పట్టు కోల్పోతున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో బీఆర్ఎస్ వెనుకబడిందనే భావన ఉంది.
మొత్తానికి, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ఒక వేక్-అప్ కాల్. రాబోయే ఎన్నికల నాటికైనా పుంజుకోవాలంటే, ఆ పార్టీ తన వ్యూహాలను సమూలంగా మార్చుకోవాల్సిందే. లేదంటే తెలంగాణ రాజకీయాల్లో రెండో స్థానాన్ని కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
ఇవి కూడా చదవండి













