Payyavula Keshav: స్వర్ణాంధ్ర-2047 దిశగా రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక అడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. ఇందులో రూ.2,56,143 కోట్లు ఆదాయ వ్యయంగా, రూ.53,915 కోట్లు మూలధన వ్యయంగా కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అదే సమయంలో రూ.22 వేల కోట్ల ఆదాయ లోటు, సుమారు రూ.75 వేల కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని కూడా స్పష్టం చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అమరావతిలోని టీటీడీ ఆలయం (TTD Temple, Amaravati)ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం ఉదయం 11.20 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో మండలిలో హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం తనకు గర్వకారణమని చెప్పారు. బడ్జెట్ అంటే కేవలం ఆదాయం, ఖర్చుల లెక్కల సమాహారం కాదని, రాష్ట్ర అభివృద్ధి , ప్రజా సంక్షేమం సమానంగా ముందుకు సాగేందుకు ఇది మార్గదర్శక పత్రం అని పేర్కొన్నారు. ప్రతి రూపాయి ప్రజల ఆశలు నెరవేర్చేందుకు ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేశామని మంత్రి వివరించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించే పథకాలు రూపొందించామని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు, యువతకు ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు బడ్జెట్లో ప్రధానంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇదే సందర్భంలో గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన మొదటి దెబ్బ అయితే, 2019 నుంచి 2024 మధ్య పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపించారు. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేలా చేశాయని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించడం, అభివృద్ధి పథంలో తిరిగి నడిపించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
2024లో పునర్నిర్మాణానికి పునాది వేసి, 2025 బడ్జెట్తో అభివృద్ధి దిశగా అడుగులు వేసామని చెప్పారు. కేవలం 20 నెలల పాలనలోనే రాష్ట్రం సానుకూల మార్పు దిశగా సాగుతోందని పేర్కొన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ నిర్మాణాత్మక విధానాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మొత్తానికి ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక లోటులను సమర్థంగా ఎదుర్కొంటూనే అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా నడిపించాలన్న సంకల్పాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ కీలకంగా నిలుస్తుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి













