Municipal Elections: చైర్మన్ కుర్చీ కోసం స్వతంత్రుల పంతం.. మున్సిపల్ ఫలితాల తర్వాత మొదలైన అసలు రాజకీయం!
Municipal Elections: రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు వింత పరిస్థితిని తెచ్చిపెట్టాయి. మెజారిటీ చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరినప్పటికీ, సుమారు 12 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీల్లో పీఠాన్ని దక్కించుకోవాలంటే స్వతంత్ర అభ్యర్థుల (Independents) మద్దతు అనివార్యంగా మారింది.
స్వతంత్రుల ‘గొంతెమ్మ’ కోరికలు:
సాధారణంగా గెలిచిన స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడానికి పార్టీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. “మద్దతు కావాలంటే మాకే చైర్మన్ పదవి ఇవ్వాలి” అంటూ స్వతంత్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన సీనియర్లను కాదని, బయటి వ్యక్తికి చైర్మన్ పదవి ఎలా ఇవ్వాలో తెలియక కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
క్యాంపు రాజకీయాలు:
అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు పార్టీలు ఇప్పటికే ‘క్యాంపు’ రాజకీయాలకు తెరలేపాయి. గెలిచిన వారిని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అలియాబాద్ (మేడ్చల్ జిల్లా): ఇక్కడ 20 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7 స్థానాలు సాధించాయి. ఒక్క సీటు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి గాదె వెంకటేష్ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారారు. చైర్మన్ పదవి ఇచ్చే పార్టీకే నా మద్దతు అని ఆయన తేల్చి చెప్పారు.
జనగామ: ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ బలబలాలు సమానంగా ఉండటంతో, స్వతంత్ర అభ్యర్థి పాండు కోసం రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. తనను చైర్మన్ చేస్తామంటేనే వస్తానని ఆయన షరతు విధించడం విశేషం.
పార్టీల భయం:
ఒకవేళ భారీ ఆఫర్లు ఇచ్చి స్వతంత్రులకు చైర్మన్ పదవి కట్టబెట్టినా, వారు తర్వాత వేరే పార్టీలోకి జంప్ అయితే పరిస్థితి ఏంటన్నది పార్టీల ఆందోళన. ప్రస్తుతం ఈ ‘హంగ్’ మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో, రాజకీయ సమీకరణాలు గంటగంటకూ మారుతున్నాయి.













