Revanth Reddy: రేవంత్ రెడ్డి : రాజూ నువ్వే.. మంత్రీ నువ్వే..!
రాజకీయాల్లో “మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు” అనే సామెత చాలామంది నేతలకు వర్తిస్తుంది. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. “చెప్పి మరీ కొట్టడం” అంటే ఏంటో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆయన నిరూపించారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న ప్రచారం, పార్టీలో అంతర్గత విభేదాల గోల, ప్రతిపక్షాల విమర్శలు.. వీటన్నింటినీ తనదైన శైలిలో ‘హుష్ కాకి’ చేసేశారు రేవంత్.
మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఒకటే చర్చ. “కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది, రేవంత్ రెడ్డికి పట్టు దొరకడం లేదు, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది” అంటూ ప్రత్యర్థులు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ, ఫలితాలు వెలువడ్డాక ఆ ప్రచారమంతా నీటి మూటని తేలిపోయింది. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు అన్నది కాదు ముఖ్యం.. పని జరిగిందా? బుల్లెట్ దిగిందా? అన్నదే అసలు పాయింట్ అని రేవంత్ మరోసారి చాటిచెప్పారు.
ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేసిన వారికి, ఎన్నికల ఫలితాల రూపంలోనే ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. ఒక్క రోజు ముందే ఢిల్లీ గడ్డపై నిలబడి “నేనే రాజు.. నేనే మంత్రి” అని ప్రకటించినప్పుడు, అది కాస్త అతిగా అనిపించినా.. ఇవాళ ఫలితాలు చూశాక “అది అతి కాదు.. ఆయనకున్న ఆత్మవిశ్వాసం” అని విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నారు.
ప్రభుత్వంపై చిన్నపాటి అసంతృప్తి ఉండొచ్చు, పాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. కానీ, “ప్రత్యామ్నాయం మాత్రం నువ్వే” అంటూ తెలంగాణ జనం మున్సిపల్ పోరులో కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. రికార్డు స్థాయిలో అత్యధిక మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను హస్తం పార్టీ కైవసం చేసుకోవడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి దక్కిన అసలైన విజయం. పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని, ఒకరికొకరు పడటం లేదని బయట ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్నికల యుద్ధ క్షేత్రంలోకి వచ్చేసరికి కాంగ్రెస్ శ్రేణులు “మేమంతా ఒక్కటే” అని చాటిచెప్పాయి. ప్రత్యర్థులను చిత్తు చేయడంలో రేవంత్ రెడ్డి తన సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం.
ఇవి కూడా చదవండి
సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు “పాతాళంలోకి తొక్కేస్తా.. తొక్క తీసి నార తీస్తా” అంటూ వాడే పదజాలం చూసి చాలామంది అది కేవలం మాస్ డైలాగులు మాత్రమే అనుకున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు తగిలిన దెబ్బ చూస్తుంటే.. ఆయన అన్న మాటలు ఫలితాల రూపంలో ప్రతిఫలించాయని స్పష్టమవుతోంది. ఎదురు పార్టీలను చాచి చావుదెబ్బ కొట్టడం ద్వారా, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తనకి తిరుగులేదని ఆయన నిరూపించుకున్నారు.
మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం కాబోతున్నప్పటికీ, హంగ్ ఏర్పడిన చోట్ల ‘క్యాంపు రాజకీయాలు’ అప్పుడే మొదలయ్యాయి. తమ కార్పొరేటర్లను కాపాడుకుంటూనే, ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టడంలో రేవంత్ టీమ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. అధికారం చేతిలో ఉండటం, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం హస్తం పార్టీకి నల్లేరు మీద నడకే కానుంది.
ఈ విజయంతో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ మీద తన పట్టును మరింత బిగించారు. విమర్శకులకు నోళ్లు మూయించారు. రాజకీయాల్లో టైమింగ్, టార్గెట్ ఎంత ముఖ్యమో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. “నేనే రాజు.. నేనే మంత్రి” అన్న రేవంత్ మాటల్లో ఇక ఎంతమాత్రం సందేహం లేదు. మున్సిపల్ పోరులో విజయదుందుభి మోగించిన రేవంత్ రెడ్డి, ఇక పాలనలో కూడా అదే ‘కసి’ చూపిస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి













