BJP: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపైనే ఉంది. జూన్ నెలలో ఖాళీ కానున్న నాలుగు స్థానాల కోసం మే నెలలో నోటిఫికేషన్ రానుంది. అధికార కూటమిలో అప్పుడే సమీకరణాలు వేడెక్కాయి. ముఖ్యంగా కూటమిలోని మూడు పార్టీలు ఈ స్థానాలను ఎలా పంచుకుంటాయి? అభ్యర్థులు ఎవరు? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
వచ్చే జూన్ 21తో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల దృష్ట్యా, ఈ నాలుగు స్థానాలూ అధికార కూటమికే దక్కడం ఖాయం. ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం టీడీపీ 2 స్థానాలు, బీజేపీ ఒకటి, జనసేన ఒక స్థానాన్ని పంచుకునే అవకాశం ఉంది.
జనసేన పార్టీకి కేటాయించే ఒక స్థానం కోసం పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండటం, ఆర్థికంగా అండగా నిలవడమే ఆయనకు సానుకూల అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో ఇతర నేతలు కూడా ఉన్నప్పటికీ, సామాజిక, వ్యక్తిగత సమీకరణాల దృష్ట్యా పవన్ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీకి దక్కే రెండు స్థానాల్లో ఒకదానికి సానా సతీష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు టాక్. ఇక రెండో స్థానం కోసం టీడీపీలో భారీ పోటీ నెలకొంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్లు, ఇటీవలే పార్టీలో చేరిన కీలక నేతలు ఈ సీటును ఆశిస్తున్నారు. అధిష్టానం మాత్రం సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థిని ఎంపిక చేసే ఆలోచనలో ఉంది.
అయితే బీజేపీ నుంచి ఎవరు ఎంపికవుతారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరి అంచనాలకు అందని విధంగా, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ కొత్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే కె.అన్నామలై. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడైన అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే వ్యూహంలో కేంద్ర బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. అక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినందుకు అన్నామలై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ అసంతృప్తిని చల్లార్చవచ్చని హైకమాండ్ భావిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారిగా, ముక్కుసూటిగా మాట్లాడే నేతగా అన్నామలైకు దక్షిణాది యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన రాజ్యసభలో ఉంటే దక్షిణాది సమస్యలపై గళం విప్పే అవకాశం ఉంటుంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ కు, అన్నామలైకు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో అన్నామలై ఎన్నికల ప్రచారానికి కూడా లోకేశ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో అన్నామలై అభ్యర్థిత్వానికి టీడీపీ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు.
మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు విజయసాయి రెడ్డి. అయితే ఇటీవల మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ప్రకటించిన విజయసాయి రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన రాజ్యసభకు నామినేట్ అవుతారని కొందరు భావిస్తున్నప్పటికీ, అది బీజేపీ కోటాలో జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్. ఆయన ఇటీవల హిందూ ధర్మం, జాతీయ అంశాలపై చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉండటం గమనార్హం.
ఏది ఏమైనా, జూన్ రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పబోతున్నాయి. అన్నామలై వంటి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేత ఏపీ నుంచి వెళ్తారా? లేదా స్థానిక సమీకరణాలకే పార్టీలు మొగ్గు చూపుతాయా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.













