Russia Oil: రష్యా చమురు కొనబోమని భారత్ మాటిచ్చింది: రూబియో
రష్యా నుంచి ముడి చమురు (Russia Oil) కొనుగోళ్ల వ్యవహారంపై జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికగా అమెరికా, భారత్ మధ్య ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. రష్యా నుంచి ఇకపై అదనంగా ముడి చమురును కొనుగోలు చేయబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై అమెరికా కొత్తగా విధించిన కఠిన ఆంక్షల నేపథ్యంలో భారత్తో జరిపిన తాజా చర్చల్లో ఈ మేరకు స్పష్టత వచ్చిందని, యూరప్ దేశాలు కూడా ఇవే తరహా చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు.
అయితే అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అదే వేదికపై దీటుగా బదులిచ్చారు. చమురు (Russia Oil) కొనుగోళ్ల విషయంలో భారత్కు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతర్జాతీయ చమురు మార్కెట్ అత్యంత సంక్లిష్టమైనదని, భౌగోళిక రాజకీయాలతో పాటు పలు వాణిజ్య అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఇంధన కంపెనీలు కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. దేశ ఇంధన అవసరాల విషయంలో తాము ఎప్పుడూ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో (Strategic Autonomy) నిర్ణయాలు తీసుకుంటామని, గతం నుంచి ఇదే తమ విధానమని జైశంకర్ స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ దేశం నుంచి చమురు (Russia Oil) కొనుగోలు చేయాలనే విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు, పూర్తి స్వతంత్రం భారత్కు ఉందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.













