Rahul Gandhi: యూఎస్-భారత్ డీల్‌పై రైతులతో రాహుల్ భేటీ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అన్నదాతల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల నడుమ దేశ రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంటు ప్రాంగణంలో దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రధాన రైతు సంఘాల ప్రతినిధులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమావేశమయ్యారు. ఈ ఒప్పందం వల్ల పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పండ్ల సాగు చేసే రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని వారు కోరగా.. వారికి తాము అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్ (Rahul Gandhi).. ప్రధాని మోదీ రైతులను మోసం చేశారని విమర్శించారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదని, రైతుల జీవనోపాధిపై నేరుగా జరిగిన దాడి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరల లేమితో సతమతమవుతున్న దేశీయ రైతులు.. ఇప్పుడు భారీ సబ్సిడీలు పొందుతున్న విదేశీ ఉత్పత్తులతో పోటీ పడాల్సి రావడం దారుణమన్నారు. అన్నదాతల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టొద్దని, వారి హక్కులు, గౌరవం కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే రాహుల్ (Rahul Gandhi) భేటీపై అధికార బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న కృత్రిమ నాటకమని కొట్టిపారేశారు. తమ పార్టీ కార్యకర్తలనే రైతు నాయకులుగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారతీయ రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రక్షణ కల్పించిందని, విపక్షాల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని గోయల్ (Piyush Goyal) స్పష్టంచేశారు.













