Piyush Goyal: యూఎస్ డీల్‌తో తగ్గనున్న చమురు ధరలు: గోయల్
భారత్-అమెరికా మధ్య తాజాగా కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశ భవిష్యత్ ఇంధన, పారిశ్రామిక అవసరాలకు పెద్ద పీట వేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ డీల్ ద్వారా భారత్‌కు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ (ముడి చమురు), ఎల్ఎన్జీ, ఎల్పీజీ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 7 శాతం మేర ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి (Piyush Goyal) తెలిపారు. అమెరికా లాంటి కొత్త సరఫరాదారుల రాకతో ఇంధనాన్ని మరింత పోటీ ధరలకు పొందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక పారిశ్రామిక రంగంపై, ముఖ్యంగా ఉక్కు ఉత్పత్తిపై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుందని గోయల్ వివరించారు. ప్రస్తుతం దేశంలో ఏటా 140 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుండగా, త్వరలో ఇది రెట్టింపు కానుందని అంచనా వేశారు. ఉక్కు తయారీకి అవసరమైన కోకింగ్ కోల్ దిగుమతుల విలువ ప్రస్తుతం రూ.1.50 లక్షల కోట్లుగా ఉండగా, భవిష్యత్తులో ఇది రూ.3 లక్షల కోట్లకు చేరనుందన్నారు. ప్రస్తుతం కోకింగ్ కోల్ కోసం కేవలం రెండు, మూడు దేశాలపైనే ఆధారపడుతున్న మనం.. అమెరికాతో ఒప్పందం ద్వారా సరఫరాదారుల మార్కెట్‌ను విస్తరించుకుని, నిలకడైన సరఫరాతో పాటు ధరల్లోనూ స్థిరత్వం సాధించవచ్చని గోయల్ (Piyush Goyal) వివరించారు. ఈ ఒప్పందం భారతీయ పరిశ్రమలకు ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.













