Pawan Kalyan: పిఠాపురం రండి పవన్ ప్లీజ్..!
2024 సార్వత్రిక ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నియోజక వర్గాల్లో పిఠాపురం నియోజకవర్గ ఒకటి. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ఉపముఖ్యమంత్రి(Deputy CM) అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ, విజయం సాధించకపోయినా.. పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం మంచి విజయాన్ని భారీగా తన ఖాతాలో వేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం లేదనే, కోపం కొంత క్షేత్రస్థాయిలో వ్యక్తం అవుతుంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు దూకుడుగా కొనసాగుతున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో తిరగడం లేదనే ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో కనపడుతోంది.
దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తూ వస్తున్నారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం కూడా కోరుతోంది. కూటమిలో మరో కీలక పార్టీ అయిన టిడిపి(TDP)తో ఇక్కడ విభేదాలు సమసిపోయినప్పటికీ.. ఇదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పోటీ చేయనున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాకుండా గ్రామాల్లో కార్యకర్తలతో స్వయంగా మాట్లాడాలని.. ప్రజలతో మమేకం కావాలని పవన్ కళ్యాణ్ ను నాయకులు కోరుతున్నారు.
ఇటీవల కాలంలో పార్టీ బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఆ ప్రభావం పెద్దగా కనబడటం లేదు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలో కూటమి నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా కీలకంగానే ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఆయన సహకారంతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పర్యటించటం, అభివృద్ధి కార్యక్రమాలను కాకినాడ ఎంపీ తోనో లేదంటే నియోజకవర్గం ఇన్చార్జి తోనో శంకుస్థాపనలు చేయించకుండా, స్వయంగా పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని.. కనీసం నెలకు రెండు రోజులైనా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఉండే విధంగా చూసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక జనసేన(Janasena) పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలను కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తే బాగుంటుందనే భావన కూడా వ్యక్తం అవుతుంది.













