Bangladesh: బంగ్లాదేశ్ ప్రధానిగా డార్క్ ప్రిన్స్ తారిఖ్ రెహ్మాన్..!
బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయం ప్రకారం అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ … తారిఖ్ తో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులతోనూ ప్రమాణం చేయించారు. రాజధాని ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమానికి .. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు.
బంగ్లాదేశ్లో గత 35 ఏళ్లుగా మహిళలే ప్రధానులుగా కొనసాగారు. ఈ కాలంలో అవామీ లీగ్ అధినేత నేత షేక్ హసీనా, బీఎన్పీ నాయకురాలు ఖాలిదా జియాలే దేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు బీఎన్పీ ఛైర్మన్గా ఉన్న తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిష్ఠించిన పురుష ప్రధానిగా నిలిచారు.
ఖాలిదా జియా కుమారుడైన రెహమాన్ 2008లో బంగ్లా విడిచి వెళ్లారు. 17 ఏళ్ల పాటు బ్రిటన్లో ప్రవాస జీవితం గడిపారు. గతేడాది డిసెంబరులోనే స్వదేశానికి వచ్చారు. తల్లి మరణించడంతో పార్టీ బాధ్యతలు స్వీకరించి బీఎన్పీని విజయపథంలో నడిపారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన గెలుపొందారు. 299 పార్లమెంట్ స్థానాలకుగానూ 209 చోట్ల పార్టీ విజయం సాధించింది.
2024లో హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత .. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత బంగ్లాదేశ్ నియమాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ కు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆపార్టీ ఎన్నికల్లో పోటీచేయకుండా బ్యాన్ విధించింది తాత్కాలిక ప్రభుత్వం. దీంతో బీఎన్పీ, జమాతే పార్టీలు పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో 209 స్థానాల్లో గెలిచి అధికారపగ్గాలు అందుకుంది బీఎన్పీ.













