GITAM: గీతంకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్ట్
గీతం విద్యాసంస్థకు (GITAM), తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) మధ్య విద్యుత్ బకాయిలపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మానవీయ కోణాన్ని, విద్యాసంస్థల ప్రాముఖ్యతను, ప్రభుత్వ సంస్థల ఆదాయ వనరులను సమన్వయం చేస్తూ సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ వివాదానికి మూలం ‘వీబీసీ ఫెర్రో అలాయ్స్’ (VBC Ferro Alloys) అనే సంస్థ. ఈ సంస్థ విద్యుత్ శాఖకు సుమారు రూ. 118 కోట్ల మేర బకాయి పడింది. అయితే, ఈ వీబీసీ ఫెర్రో అలాయ్స్ సంస్థకు, గీతం యాజమాన్యానికి మధ్య ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా, ఆ బకాయిలను గీతం సంస్థే చెల్లించాలని విద్యుత్ పంపిణీ సంస్థ నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించని పక్షంలో గీతం విద్యాసంస్థకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నోటీసులను గీతం యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. వీబీసీ ఫెర్రో అలాయ్స్ బకాయిలకు, తమ విద్యాసంస్థకు నేరుగా సంబంధం లేదని, విద్యుత్ శాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు వాదించారు.

మొదట ఈ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. అక్కడ విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్, వివాదం తేలే వరకు గీతం సంస్థ రూ. 54 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే, అంత పెద్ద మొత్తాన్ని తక్షణమే చెల్లించడం తమపై భారం అవుతుందని భావించిన గీతం యాజమాన్యం, ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. గీతం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చిందని, రూ. 54 కోట్ల డిపాజిట్ అనేది విద్యాసంస్థ నిర్వహణపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యేమార్గంగా ఒక తీర్పు వెల్లడించింది. హైకోర్టు విధించిన రూ. 54 కోట్ల డిపాజిట్ మొత్తాన్ని సుప్రీంకోర్టు తగ్గించింది. నాలుగు వారాల్లోగా రూ. 15 కోట్లను విద్యుత్ సంస్థ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గీతం ఒక విద్యాసంస్థ అనే అంశాన్ని కోర్టు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు, విద్యాబోధన దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో ఉన్న అసలు చిక్కుముడిని విప్పేందుకు, ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్న ప్రధాన రిట్ పిటిషన్ను వీలైనంత త్వరగా విచారించి పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టును సూచించింది.
ఈ తీర్పు పలు ఆసక్తికరమైన అంశాలను తెరపైకి తెచ్చింది. ఒక వ్యాపార సంస్థ (VBC Ferro Alloys) బకాయిలను మరో విద్యాసంస్థపై రుద్దడం చట్టపరంగా ఎంతవరకు సమంజసం అనే అంశం ఇప్పుడు హైకోర్టులో తేలాల్సి ఉంది. సుప్రీంకోర్టు ప్రాథమికంగా గీతంకు ఉపశమనం కలిగించినప్పటికీ, బకాయిల బాధ్యతపై క్లారిటీ ఇవ్వలేదు. రూ. 54 కోట్లకు బదులుగా రూ. 15 కోట్లు చెల్లించాలని చెప్పడం ద్వారా గీతం సంస్థకు తక్షణ ఆర్థిక భారం తగ్గింది. ఇది యాజమాన్యానికి పెద్ద ఊరట. మరోవైపు, ప్రభుత్వ సంస్థ అయిన TSSPDCLకు రావాల్సిన భారీ బకాయిల విషయంలో కోర్టు పూర్తిగా పక్కన పెట్టకుండా, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయమనడం ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను కూడా కాపాడింది.
గీతం విద్యుత్ బకాయిల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక ‘మధ్యేమార్గం’గా కనిపిస్తోంది. విద్యాసంస్థల పట్ల న్యాయస్థానాలకు ఉండే సానుకూల దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. అయితే, రూ. 118 కోట్ల భారీ బకాయిల అసలు బాధ్యత ఎవరిది? గీతం సంస్థ వీబీసీ ఫెర్రో అలాయ్స్ బకాయిలను చెల్లించాల్సిందేనా? అనే ప్రశ్నలకు సమాధానం తెలంగాణ హైకోర్టు ఇచ్చే తుది తీర్పులోనే లభించనుంది. అప్పటి వరకు ఈ రూ. 15 కోట్ల డిపాజిట్ గీతంకు ఒక కవచంలా పనిచేయనుంది.
ఇవి కూడా చదవండి













