Regina: బాలీవుడ్ ఇండస్ట్రీపై రెజీనా సంచలన కామెంట్స్
సౌత్ లో మంచి పేరు సంపాదించిన తర్వాత బాలీవుడ్లో కూడా సత్తా చాటాలని అనుకోవడం చాలా మంది నటీనటుల ఆశ. అయితే ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి మారినప్పుడు అక్కడి పని విధానం, వాతావరణం, అక్కడి కల్చర్ వారికి కొత్త అనుభవాన్ని ఇస్తాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ నుంచి నార్త్‌కు వెళ్లిన పలువురు కళాకారులు వివిధ సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదే వరుసలో దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన రెజీనా కెసాండ్రా(Regina Cassandra) బాలీవుడ్ లో తన అనుభవాలను పంచుకుంటూ చర్చల్లో నిలిచారు.
2019లో ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా(Ek Ladaki ko dekha aisa laga) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రెజీనా, అక్కడి ప్రయాణం తాను ఊహించినంత సులభంగా సాగలేదని వెల్లడించారు. హిందీ భాషపై పూర్తి పట్టు ఉన్నప్పటికీ, మాట్లాడటం, రాయటం రెండింటిలోనూ నైపుణ్యం కలిగినప్పటికీ, ఇతర హీరోయిన్ల మాదిరిగా డబ్బింగ్ ఆర్టిస్టులను వినియోగించుకోకుండా తన డబ్బింగ్ తానే చెప్పుకున్నప్పటికీ, పూర్తిగా ఆ ఇండస్ట్రీలో కలిసిపోయాననే భావన కలగలేదని పేర్కొన్నారు. సౌత్ నుంచి వచ్చిన నటిగా కొందరు తనను వేరేలా చూసిన సందర్భాలు ఎదురయ్యాయని, ఆ వైఖరి కొన్నిసార్లు తనను అసౌకర్యానికి గురిచేసిందని తెలిపారు.
అయితే బాలీవుడ్ మొత్తం అలాంటిదే కాదని కూడా రెజీనా స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలబడి గౌరవించిన వారు కూడా ఉన్నారని, అందరినీ ఒకే కోణంలో చూడలేమని చెప్పారు. కొత్త వాతావరణం, కొత్త పని విధానం, కొత్త వ్యక్తులతో కలిసి పనిచేయడం మొదట్లో ఒత్తిడిని కలిగించినప్పటికీ, ప్రతి ఇండస్ట్రీలోనూ తాను సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తానని వివరించారు. విభిన్న అనుభవాల మధ్య కూడా తన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తున్నట్లు రెజీనా మాటల్ని బట్టి అర్థమవుతుంది.













