Muhammad Yunus: కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్.. యూనస్ దారెటు?
బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసి, కొత్త శకానికి తెరలేవబోతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత గత రెండేళ్లుగా ఆ దేశ పగ్గాలను విజయవంతంగా చేపట్టిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోనుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత తారిఖ్ రెహ్మాన్ ఈ నెల 17న ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన ‘చీఫ్ అడ్వైజర్’ ముహమ్మద్ యూనస్ తదుపరి పాత్ర ఏమిటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, తారిఖ్ రెహ్మాన్ తన ప్రభుత్వంలో ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) వంటి మేధావుల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. యూనస్‌కు ఏదైనా రాజ్యాంగబద్ధమైన లేదా కీలకమైన సలహాదారు పదవి దక్కవచ్చని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయనను బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా నియమిస్తే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలను ముహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఖండించారు. యూనస్‌కు ఎలాంటి పదవులపై ఆసక్తి లేదని, బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన తన ప్రియతమ లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నివారణ, సున్నా కర్బన ఉద్గారాల సాధన కోసం అంతర్జాతీయ స్థాయిలో పని చేయాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తారిఖ్ రెహ్మాన్ అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రతిభావంతులను, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న మేధావులను కలుపుకుని వెళ్లడానికి నూతన ప్రధాని ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. యూనస్‌తో (Muhammad Yunus) సంప్రదింపులు జరపడం అనేది సహజమైన ప్రక్రియ అని, దేశ ప్రయోజనాల దృష్ట్యా తగిన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి హసీనా తదుపరి శకంలో బంగ్లాదేశ్‌ను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లడంలో యూనస్ పాత్ర ప్రత్యక్షంగా ఉంటుందా లేక పరోక్షంగా ఉంటుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.
బంగ్లాదేశ్‌లో తలెత్తిన ఈ నూతన రాజకీయ పరిణామాలు భారత్‌తో ఆ దేశ దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది కూడా ఇప్పుడు అందరూ గమనిస్తున్న విషయం. తారిఖ్ రెహ్మాన్ పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక ఆహ్వానం ఈ మైత్రిని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మోదీ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం లేదు. ఆయన స్థానంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వెళ్తున్నారు. భారత్‌తో బంగ్లాదేశ్ బంధాలు దెబ్బతినడంలో యూనస్ (Muhammad Yunus) పాత్ర చాలానే ఉంది. భారత్‌తో బంధాలను పునరుద్ధరించాలనుకుంటే.. యూనస్‌ను పక్కనపెట్టేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.













