Iran-US Deal: యూఎస్‌తో డీల్‌కు సిద్ధం.. నిర్ణయం వారి చేతుల్లోనే: ఇరాన్
అమెరికా, ఇరాన్ (Iran-US Deal) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నలుగుతున్న అణు ఒప్పందం (న్యూక్లియర్ డీల్) వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తమ అణు కార్యక్రమాలపై రాజీ పడేందుకు, అలాగే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అయితే ఇందుకు ఆ దేశం ఓ ప్రధాన షరతు విధించింది. తమపై అమెరికా విధించిన కఠినమైన వాణిజ్య, ఆర్థిక ఆంక్షలన్నింటినీ పూర్తిగా ఎత్తివేస్తేనే ఈ ఒప్పందానికి ముందుకొస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మజీద్ తఖ్త్ రవాంచీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంక్షల ఎత్తివేత విషయంలో అమెరికా (Iran-US Deal) చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, తమ అణు ఉత్పత్తి కార్యక్రమాలపై పరిమితులు విధించుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని, అసలు ఈ డీల్ కావాలా వద్దా అనేది ఇక వారే తేల్చుకోవాలని రవాంచీ స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ అణు ఒప్పందంపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఏ నిర్ణయం తీసుకోకుండా చర్చలను సాగదీస్తోందని అగ్రరాజ్యం ఇన్నాళ్లూ ఆరోపించింది. ఇరాన్‌తో ఒక ఒప్పందానికి రావడం అత్యంత కష్టతరమైన వ్యవహారమని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇటీవలే బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
రెండు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ చేసిన తాజా ప్రకటన (Iran-US Deal) అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా కనుక ఆంక్షల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటే, ఇరు దేశాల మధ్య త్వరలోనే చారిత్రక అణు ఒప్పందం సాకారమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంతర్జాతీయ దౌత్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి













