TAL: టీఏఎల్ 14వ వార్షిక వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం
లండన్, 15 ఫిబ్రవరి 2026: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) తన 14వ వార్షిక వాలీబాల్ టోర్నమెంటు 14 ఫిబ్రవరి 2026న యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ లోని SportsDock లో విజయవంతంగా నిర్వహించింది.
బ్రిటన్ అంతటా ఉన్న తెలుగు సమాజ సభ్యులను ఏకం చేస్తూ, ఈ టోర్నమెంట్‌తో TAL 2026 క్రీడా సంవత్సరాన్ని అధికారికంగా ప్రారంభించింది. ప్రతిష్టాత్మక TAL ప్రీమియర్ లీగ్ సహా మరిన్ని క్రీడా కార్యక్రమాలు వార్షిక క్యాలెండర్లో భాగంగా కొనసాగనున్నాయి.
టీఏఎల్ ఛైర్మన్ రవి సబ్బా విజేత జట్లను వారి క్రీడా స్ఫూర్తి, పట్టుదల, నైపుణ్యానికి అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ట్రస్టీలు సత్య పెద్దిరెడ్డి, అశోక్ మాడిశెట్టి, రవి మోచెర్ల, శ్రీదేవి ఎల్లెద్దుల, వెంకట్ నీల, కిరణ్ కప్పెటలకు కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ ఇన్-ఛార్జ్ సింధూర చెరుకు మరియు అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జోషి కొమరవల్లి నాయకత్వంలోని “బెజవాడ బ్లాకర్స్” జట్టు టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. అఖిల్ నాయకత్వంలోని “మొబైల్ 365” జట్టు బలమైన పోటీ ఇచ్చి రన్నరప్ స్థానాన్ని దక్కించుకుంది. రాకేష్ కామేపల్లి నాయకత్వంలోని “పల్నాడు టైగర్స్” జట్టు మూడవ స్థానాన్ని సాధించింది.
ఈ సందర్భంగా రవి సబ్బా మాట్లాడుతూ, క్రీడాకారుల స్ఫూర్తిని ప్రశంసిస్తూ, TAL క్రీడా, సామాజిక కార్యక్రమాలకు అందరి మద్దతు కొనసాగాలని కోరారు. అలాగే మార్చి 21, 2026న నిర్వహించనున్న టీఏఎల్ ఉగాది వేడుకలకు అందరినీ ఆహ్వానించారు.













