JD Lakshminarayana: మేఘాలో చేరిన జేడీ..! రాజకీయాలకు గుడ్ బై..!?
వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, అవినీతి అంతం చేస్తానని సింహ గర్జన చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ప్రస్థానం ఇప్పుడు ఒక ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు ఐపీఎస్ హోదాలో వందల మంది సిబ్బందిని శాసించిన వ్యక్తి, ఆ తర్వాత లక్షలాది మందికి ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత.. ఇప్పుడు నిశ్శబ్దంగా ఒక ప్రైవేట్ కంపెనీలో ‘ఉద్యోగి’గా చేరిపోయారు. మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం.. రాజకీయాల్లో ఆయన విఫలమయ్యారనడానికి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది.
లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రం ఒక సంచలనం. 2019 ఎన్నికల ముందు ఆయన ఏ జిల్లాకు వెళ్లినా వేల సంఖ్యలో యువత తరలివచ్చారు. కానీ, అప్పటినుంచి ఆయన వేసిన అడుగులన్నీ అయోమయానికే దారితీశాయి. తొలుత లోక్ సత్తా అన్నారు, తర్వాత టీడీపీ వైపు వెళ్తారని ప్రచారం జరిగింది, చివరి నిమిషంలో జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్‌తో విభేదించి బయటకు రావడం ఆయన రాజకీయ అపరిపక్వతను బయటపెట్టింది. ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో ఆయన చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడం, కేవలం సోషల్ మీడియాకే పరిమితం కావడం లక్ష్మీనారాయణను ఒంటరిని చేశాయి.
రాజకీయాల్లో రాణించాలంటే కేవలం నిజాయితీ ఉంటే సరిపోదు. వ్యూహం, ఆర్థిక వనరులు కూడా ముఖ్యమని లక్ష్మీనారాయణ ఆలస్యంగా గుర్తించినట్లున్నారు. 2024 ఎన్నికల ముంగిట తన పార్టీ అస్తిత్వం కోసం ఆయన పడిన తపన ఫలించలేదు. మరోవైపు, ఇటీవల ఆయన భార్య ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో సుమారు రూ. 2.58 కోట్లు పోగొట్టుకోవడం ఆయనను ఆర్థికంగా, మానసికగా కుంగదీసి ఉండవచ్చు. ఒక వైపు రాజకీయ భవిష్యత్తు అస్పష్టంగా ఉండటం, మరోవైపు వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఆయనను మళ్ళీ ఉద్యోగంలో చేరేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఎదురించిన సంస్థలకే అనుబంధంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం చేయాల్సి రావడం ఒక రకమైన విధి వైపరీత్యం అనే చెప్పాలి.
మేఘా ఇంజినీరింగ్ వంటి భారీ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ పదవి అంటే అది గౌరవప్రదమైనదే కావచ్చు, కానీ లక్ష్మీనారాయణ వంటి వ్యక్తికి ఇది ఒక మెట్టు దిగడమే. ఉద్యోగంలో చేరడం అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపు స్వస్తి చెప్పినట్లే. ఏ కార్పొరేట్ సంస్థ కూడా తన కీలక హోదాలో ఉన్న వ్యక్తి యాక్టివ్ పాలిటిక్స్ చేయడం ఇష్టపడదు. ఒకప్పుడు తన సంతకంతో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ లాభనష్టాల కోసం, టార్గెట్ల కోసం పని చేయాల్సి ఉంటుంది.
జేడీ లక్ష్మీనారాయణ ఉదంతం భారతీయ రాజకీయాల్లో ఒక చేదు నిజాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. కేవలం అధికారుల ఇమేజ్‌తో, ఆవేశపూరిత ప్రసంగాలతో వ్యవస్థను మార్చలేమని ఆయన ప్రయాణం నిరూపించింది. ఐఐటీ డిగ్రీ, ఐపీఎస్ అనుభవం ఉన్నా.. చివరకు రాజకీయాల్లో ఇమడలేక, మళ్ళీ కార్పొరేట్ కొలువులో తలదాచుకోవాల్సి రావడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేసే అంశమే. ఒకప్పటి పవర్ఫుల్ ‘జేడీ’.. ఇప్పుడు కేవలం ఒక ‘వైస్ ప్రెసిడెంట్’. ఇది ఒక వ్యక్తి ప్రస్థానంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ఆదర్శవాద రాజకీయాలకు పట్టిన గ్రహణంగా కూడా అభివర్ణించవచ్చు.













