Gadwal: ఒక్క ఓటుతో మేయర్ మారిపోతారా? గద్వాల్లో ఉత్కంఠ
తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాల కొలువుదీరడానికి ముహూర్తం ఖరారైంది. అయితే కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గద్వాల్ (Gadwal) వంటి సీట్లలో చాలా టెన్షన్ కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క ఓటుతో మేయర్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 పురపాలికల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి, చేతులెత్తే పద్ధతి ద్వారా పురపీఠాలను అధిష్టించే వారెవరో తేల్చనున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నాగర్కర్నూల్, వనపర్తితో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్ సహా మొత్తం 11 పురపాలికలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హంగ్ ఏర్పడిన దేవరకద్రలో స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పీఠం దక్కించుకోనుంది. మరోవైపు అయిజలో బీఆర్ఎస్, వడ్డేపల్లిలో ఏఐఎఫ్బీ పురపాలక పీఠాలను కైవసం చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి
అయితే గద్వాల (Gadwal), అలంపూర్ వంటి చోట్ల ఉత్కంఠ కొనసాగుతోంది. అలంపూర్లో ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటు భారాసకు కీలకం కానుంది. ఇక గద్వాల మున్సిపాలిటీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ మొత్తం 37 వార్డులకు గాను కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా.. కాంగ్రెస్ పార్టీ తనకున్న 16 మంది సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎక్స్ అఫీషియో ఓటుతో గద్దెనెక్కాలని వ్యూహాలు రచిస్తోంది. స్వతంత్రులు కాంగ్రెస్కు మద్దతివ్వకపోతే ఏం జరుగుతుందనేది ప్రశ్న. అదే సమయంలో అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా పీఠాన్ని దక్కించుకునేందుకు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం జరిగే ఎన్నిక ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి













