Telangana Muncipal Polls: బలపరీక్షకు రంగం సిద్ధం… చైర్పర్సన్ ఎన్నికల్లో హైటెన్షన్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Telangana Muncipal Polls) నగారా ముగిసి, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి సోమవారం జరగనున్న ప్రమాణ స్వీకారాలు, మేయర్, ఛైర్మన్ల ఎంపికపై పడింది. మెజారిటీ మున్సిపాలిటీల్లో స్పష్టమైన తీర్పు వచ్చినప్పటికీ, దాదాపు రెండు డజన్ల పైగా పురపాలికల్లో ‘హంగ్’ ఏర్పడటంతో రాజకీయ వాతావరణం సెకన్ల వ్యవధిలో మారిపోతోంది. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. అర్థరాత్రి వరకు సాగిన బేరసారాలు, ఎక్స్అఫీషియో ఓట్ల లెక్కలు, స్వతంత్రుల మద్దతుతో మున్సిపల్ భవనాల వద్ద ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, దేవరకద్రల్లో కాంగ్రెస్‌కు మార్గం సుగమం కాగా, అలంపూర్ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనుంది. అయితే నారాయణపేటలో మాత్రం బీజేపీ (13), కాంగ్రెస్ (11) మధ్య పోరు రసవత్తరంగా (Telangana Muncipal Polls) మారింది. ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిర్ణయం కీలకం కానుంది. అమరచింతలో మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం పెరిగినా, మరో సభ్యుడి కోసం వేట కొనసాగుతోంది. కామారెడ్డిలో కాంగ్రెస్‌కు మరో ముగ్గురి మద్దతు అవసరం కాగా, బీఆర్ఎస్ తన కౌన్సిలర్లు చేజారిపోకుండా వీడియోలు విడుదల చేయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బోధన్‌లో కాంగ్రెస్-ఎంఐఎం దోస్తీతో పీఠం దక్కించుకునేలా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో (Telangana Muncipal Polls) బీజేపీ కింగ్ మేకర్‌గా అవతరించింది. నర్సాపూర్, మెదక్, జిన్నారం వంటి చోట్ల ఛైర్మన్ పదవి ఇస్తేనే మద్దతిస్తామంటూ కమలం పార్టీ నేతలు కఠినమైన షరతులు విధిస్తున్నారు. ఇస్నాపూర్‌లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (బీఆర్ఎస్), ఎంపీ రఘునందన్ రావు (బీజేపీ) ఓట్లు పీఠాన్ని నిర్ణయించనున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య పోరు పీఠానికి అడ్డంకిగా మారింది. జమ్మికుంటలో బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు సాగుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ (Telangana Muncipal Polls) ఇదే హైడ్రామా నడుస్తోంది. జనగామలో స్వతంత్రుల కోసం ఏకంగా రూ. 2 కోట్ల నగదు, కారు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. పరిగిలో ఎక్స్అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌కు అవకాశం ఉండగా, ఎల్లంపేట్లో మల్లారెడ్డి (బీఆర్ఎస్), ఈటల రాజేందర్ (బీజేపీ)ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఆసిఫాబాద్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో స్వతంత్రులు ‘బాద్షా’లుగా మారారు. మొత్తానికి, ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు వరకు ఎవరు ఏ గట్టున ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ చదరంగంలో చివరి నిమిషంలో స్వతంత్రులు, ఎక్స్అఫీషియో సభ్యులే మున్సిపల్ పీఠాల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఇవి కూడా చదవండి













