Hyderabad: హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో రాజకీయ సెగలు
హైదరాబాద్ (Hyderabad) శివారు మున్సిపాలిటీల్లో రాజకీయ సెగలు ముదురుతున్నాయి. సోమవారం జరగనున్న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఉత్కంఠ రేపుతున్న 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎనిమిది చోట్ల స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. చేవెళ్ల, షాద్నగర్, శంకర్పల్లి, మొయినాబాద్ పురపీఠాలను కాంగ్రెస్ దక్కించుకోవడం ఖాయం కాగా.. ఇబ్రహీంపట్నం, మూడుచింతలపల్లి, ఇంద్రేశం, ఇస్నాపూర్లలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయనుంది. అయితే ఆమనగల్లు, ఎల్లంపేట, అలియాబాద్లలో మాత్రం ఫలితం ఎటు మొగ్గుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఆమనగల్లులో బీఆర్ఎస్కు మేజిక్ ఫిగర్ (8) ఉన్నప్పటికీ, కేవలం ఒకే వార్డు గెలిచిన కాంగ్రెస్.. బీజేపీ మద్దతుతో పాటు ఎక్స్అఫీషియో ఓట్లను నమ్ముకుని (Hyderabad) పీఠం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అటు ఎల్లంపేట్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్కు 12 మంది సభ్యులతో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్స్అఫీషియో ఓటు బలం ఉన్నా.. 8 మంది సభ్యులున్న కాంగ్రెస్, నలుగురు సభ్యులున్న బీజేపీని కలుపుకుని బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇక్కడ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓటు కీలకం కానుంది. ఇక అలియాబాద్లో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో 9కి చేరిన కాంగ్రెస్ బలం.. పీఠం దక్కాలంటే ముగ్గురు బీజేపీ సభ్యుల మద్దతుపైనే ఆధారపడాల్సి ఉంది. బీఎస్పీ కూడా తమకే అండగా ఉంటుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎక్స్అఫీషియో ఓట్ల నమోదుతో సమీకరణాలు వేగంగా మారుతుండటంతో, ఈ శివారు పురపాలికల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి













