Congress: మేయర్ ఎన్నికల ముందు కార్పొరేటర్ల షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోందా?
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ఉత్కంఠను రేపుతోంది. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య సాగుతున్న ఎత్తులకు పైఎత్తులు సంచలనం సృష్టిస్తున్నాయి. మెజారిటీకి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న కమలం పార్టీ పీఠం తమదేనని ధీమాగా ఉండగా, కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తన కార్పొరేటర్లతో పాటు కొందరు స్వతంత్రులను శామీర్‌పేటలోని రిసార్టుకు తరలించి క్యాంపు రాజకీయాన్ని నడుపుతోంది.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ (Congress) నేతలు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు రిసార్టుకు వెళ్లి కార్పొరేటర్లతో కీలక చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. బీజేపీకి మద్దతు తెలిపిన నలుగురు స్వతంత్రుల్లో ఇద్దరు ఇప్పటికే హస్తం గూటికి చేరారని ప్రచారం జరుగుతుండటం నంబర్ గేమ్‌ను ఆసక్తికరంగా మార్చింది. మరోవైపు 15వ డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతి విడుదల చేసిన వీడియో ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఫలితాల తర్వాత బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన ఆమె.. ఇప్పుడు తన ఇష్టం వచ్చిన వారికే ఓటు వేస్తానని ప్రకటించడంతో కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆమె కాంగ్రెస్ (Congress) క్యాంపులో చేరారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన ఇంటి వద్ద ఆందోళనలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎక్స్ అఫీషియో ఓట్లు, స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ (Congress) ప్రయత్నిస్తుంటే, తమ బలాన్ని కాపాడుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. సోమవారం మధ్యాహ్నం జరగనున్న ఎన్నికల్లో అసలు విజేత ఎవరో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి













