Muncipal Results: మున్సిపల్ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్
తెలంగాణ పురపాలక రాజకీయాల్లో (Muncipal Results) సోమవారం జరగనున్న మేయర్, ఛైర్మన్ల ఎంపిక సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర స్థాయిలో బద్ధశత్రువులుగా తలపడే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు స్థానిక పీఠాల కోసం ‘అనూహ్య పొత్తులకు’ తెరలేపాయి. మ్యాజిక్ ఫిగర్ దక్కని 36 మున్సిపాలిటీల్లో అధికారమే పరమావధిగా సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒక్కో చోట ఒక్కో తీరుగా జతకట్టడం గమనార్హం. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్ కలిస్తే, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీలు ఏకమవుతుండటం ఓటర్లను విస్మయానికి గురిచేస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో స్వతంత్రుల అండతో కాంగ్రెస్ పీఠం (Muncipal Results) దక్కించుకునేలా ఉండగా.. తొర్రూరులో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉన్నా, కాంగ్రెస్ తన ఎక్స్ అఫీషియో ఓట్లతో (ఎంపీ, ఎమ్మెల్యే) బలాన్ని సమానం చేయడంతో ఫలితం టాస్ (లాటరీ) ద్వారా తేలాల్సి ఉంది. ఆదిలాబాద్‌లో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలిపి ఒక స్వతంత్ర అభ్యర్థిని ఛైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించడం విశేషం. ఖానాపూర్‌లో మూడు పార్టీల బలం సమంగా ఉండటంతో అధికారాన్ని పంచుకునే దిశగా చర్చలు సాగుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ (Muncipal Results) ఇదే హైడ్రామా కొనసాగుతోంది. భైంసాలో ఎంఐఎం, బీజేపీలు చెరో 13 ఓట్లతో సమంగా ఉండగా, ఇద్దరు స్వతంత్రుల నిర్ణయంపై గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. కామారెడ్డిలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పీఠాన్ని పంచుకోనున్నాయి (కాంగ్రెస్‌కు ఛైర్మన్, బీఆర్ఎస్కు వైస్ ఛైర్మన్). బోధన్‌లో కాంగ్రెస్-ఎంఐఎం దోస్తీ ఖరారైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ ‘కింగ్ మేకర్’గా మారింది. మెదక్‌లో కాంగ్రెస్‌కు, నర్సాపూర్‌లో బీజేపీకి ఛైర్మన్ పదవులు (Muncipal Results) దక్కేలా ఇరు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇస్నాపూర్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటు కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల పీఠంపై నెలకొన్న వర్గపోరుకు అధిష్టానం తెరదించింది. జీవన్ రెడ్డి వర్గంతో చర్చలు ఫలించడంతో అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనుంది. మెట్పల్లిలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినా, బీఆర్ఎస్-కాంగ్రెస్ కూటమి కట్టడంతో కమలనాథులు ప్రతిపక్షానికే పరిమితం కానున్నారు. వేములవాడ, రాయికల్ మున్సిపాలిటీల్లోనూ చివరి నిమిషంలో చేరికలతో సమీకరణాలు మారిపోయాయి.
పాలమూరు ప్రాంతంలో గద్వాల రాజకీయం (Muncipal Results) మలుపులు తిరుగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటవ్వగా, వారిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో ఓట్లను నమ్ముకుంది. అలంపూర్‌లో ఎమ్మెల్యే ఓటుతో బీఆర్ఎస్ నిలదొక్కుకుంది. మొత్తానికి సోమవారం మధ్యాహ్నం జరిగే ఈ ఎన్నికల్లో సుమారు 20 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉండగా, బీఆర్ఎస్కు 5, బీజేపీకి 2 చోట్ల విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు, స్వతంత్రుల జంపింగ్‌లు, ప్రత్యర్థి పార్టీల కలయికలతో తెలంగాణ పురపాలక రాజకీయం (Muncipal Results) మునుపెన్నడూ లేని రసవత్తర మలుపులకు వేదికైంది.
ఇవి కూడా చదవండి













