Kiren Rijiju: స్పీకర్ అభిశంసనపై మార్చి 9న చర్చ: కిరణ్ రిజిజు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై (Om Birla) ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై మార్చి 9న చర్చ, ఓటింగ్ జరగనుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) చెప్పారు. మార్చి 9వ తేదీ నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో షెడ్యూల్ ప్రారంభం కానుండగా, నిబంధనల ప్రకారం తొలిరోజే ఈ తీర్మానంపై సభలో చర్చించి, అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న ఈ సమావేశాలు అత్యంత కీలకంగా మారనున్నాయని, పలు ముఖ్యమైన బిల్లులు, తీర్మానాలు సభ ముందుకు రానున్నాయని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి
సభ సజావుగా సాగనివ్వకుండా విపక్షాలు పదేపదే అడ్డుకోవడం వారి స్వయంకృత అపరాధమే అవుతుందని, చర్చల్లో పాల్గొనకపోతే వారికే నష్టమని రిజిజు (Kiren Rijiju) హెచ్చరించారు. ఈ దఫా సభను స్తంభింపజేస్తే కఠిన చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. స్పీకర్‌పై ప్రవేశపెట్టిన ఈ అభిశంసన తీర్మానంపై ప్రతిపక్షాల్లో కూడా ఐక్యత లేదని, ప్రతిపక్షంలో కీలకమైన తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేయలేదని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా సభను పదేపదే వాయిదా వేయించడం పట్ల పలు చిన్న పార్టీలు సైతం అసంతృప్తిగా ఉన్నాయని రిజిజు పేర్కొన్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తమ తమ రాష్ట్రాల సమస్యలను, ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని ఆయా ప్రాంతీయ పార్టీలు బలంగా కోరుకుంటున్నాయని మంత్రి రిజిజు (Kiren Rijiju) వివరించారు.
ఇవి కూడా చదవండి













