Rahul Gandhi: యూఎస్ డీల్‌తో రైతులకు ద్రోహం .. కేంద్రానికి సూటి ప్రశ్నలు
భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ డీల్ ద్వారా కేంద్రం దేశ వ్యవసాయ రంగ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి, అన్నదాతలకు తీరని ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్.. వ్యవసాయ రంగ భవిష్యత్తును, రైతుల ప్రయోజనాలను ప్రమాదంలో పడేసేలా ఉన్న ఈ ఒప్పందంపై కేంద్రానికి ఐదు సూటి ప్రశ్నలు సంధించారు.
అమెరికా నుంచి జన్యుపరంగా మార్పులు (జీఎం) చేసిన మొక్కజొన్నతో తయారైన ‘డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్’ను పశువుల దాణా కోసం దిగుమతి చేసుకుంటే, దేశీయ పాడి పరిశ్రమ పూర్తిగా అమెరికాపై ఆధారపడాల్సి వస్తుందా? అని ఆయన (Rahul Gandhi) ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
అలాగే జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) సోయాబీన్ ఆయిల్ దిగుమతులకు అనుమతిస్తే, దేశీయంగా సోయా సాగు చేస్తున్న రైతులు భవిష్యత్తులో ధరల హెచ్చుతగ్గులను ఎలా తట్టుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందంలో అస్పష్టంగా పేర్కొన్న ‘అదనపు ఉత్పత్తులు’ ఏంటో బహిర్గతం చేయాలని, వాటి వల్ల భవిష్యత్తులో మన పప్పుదినుసులు, ఇతర పంటలపై కూడా అమెరికా దిగుమతుల ఒత్తిడి పడుతుందా అని రాహుల్ (Rahul Gandhi) నిలదీశారు.
వాణిజ్యేతర అడ్డంకుల తొలగింపు పేరుతో ఎంఎస్పీ, బోనస్‌లు, ధాన్యం సేకరణ వంటి స్వదేశీ విధానాలపై భవిష్యత్తులో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తుందా అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు ఒకసారి దేశీయ మార్కెట్ తలుపులు బార్లా తెరిచాక, ఏటేటా ఆ ప్రభావం పెరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలేమిటో దేశ ప్రజలకు, రైతులకు స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి












