Amit Shah: యూఎస్ డీల్‌పై రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలే: అమిత్ షా
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. రాహుల్ పచ్చి అబద్ధాలు ఆడుతూ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్లో దేశంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల్లో రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రధాని మోదీ పూర్తి రక్షణ కల్పించారని షా (Amit Shah) స్పష్టం చేశారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
రైతుల సంక్షేమం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న రాహుల్.. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. యూపీఏ పాలనలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ బడ్జెట్‌ను ఏకంగా రూ.1.29 లక్షల కోట్లకు పెంచి వ్యవసాయ రంగంపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. రుణమాఫీ అంటూ 70 ఏళ్ల పాటు రైతులను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేసిందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం వచ్చాకే పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా రూ.6 వేలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోందని, తద్వారా అన్నదాతలు చిన్నచిన్న అవసరాలకు అప్పుల బారిన పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి













