Vineet Nayar: మార్కులే ముఖ్యమైతే.. సగం మంది సీఈవోలకు ఉద్యోగాలుండవ్..!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పరీక్షల (Exams) సీజన్ నడుస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు మార్కుల వేటలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఈ సమయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ (Vineet Nayar) విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. బోర్డు పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అవే జీవితాన్ని శాసించలేవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేవలం పరీక్షల మార్కులే భవిష్యత్తును నిర్ణయించేటట్లయితే, నేడు ప్రముఖ కంపెనీల్లో ఉన్న సగం మంది సీఈవోలకు అసలు ఉద్యోగాలే ఉండేవి కావని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన (Vineet Nayar) తన పాత మార్కుల జాబితాను పంచుకుంటూ.. తన విద్యార్థి దశలోని ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. “నాకు 17 ఏళ్ల వయసులో కెమిస్ట్రీ పరీక్ష చాలా దారుణంగా రాశాను. తీవ్రమైన టెన్షన్లో ఉన్న నన్ను చూసి.. పరీక్ష సరిగా రాయనందుకు చచ్చిపోతావా? అని నా కజిన్ అడిగాడు. ‘లేదు’ అని నాలో నాకు క్లారిటీ రాగానే నాలోని భయం మొత్తం పోయింది. ఆ మరుసటి రోజు జరిగిన మ్యాథ్స్ పరీక్షను అదరగొట్టాను” అని తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు.
పరీక్షలు కేవలం విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తాయని, కానీ నిజ జీవితం వారి ధైర్యాన్ని, కఠిన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందని వినీత్ నాయర్ (Vineet Nayar) వివరించారు. మార్కులు ఎన్నటికీ విద్యార్థుల ప్రతిభకు కొలమానం కాదని స్పష్టం చేశారు. అందువల్ల, తల్లిదండ్రులు టెన్షన్ పడినా.. విద్యార్థులు మాత్రం అనవసర ఆందోళన చెందకుండా తమ ప్రిపరేషన్ను నమ్ముకుని ధైర్యంగా పరీక్షలు రాయాలని చక్కటి సలహా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి













