North Korea: కిమ్ ఫ్యామిలీలో అంతర్గత గొడవలు.. ఆధిపత్య పోరు తప్పదా..?
ఉత్తర కొరియా (North Korea) అనగానే నిరంకుశ పాలన, అణ్వాయుధ పరీక్షలు, ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరికలే గుర్తుకువస్తాయి. అయితే నిత్యం శత్రు దేశాలపై కయ్యానికి కాలుదువ్వే ఈ కిమ్ రాజ్యంలో ఇప్పుడు అంతర్గతంగా ఓ ఆసక్తికరమైన ఆధిపత్య పోరుకు, ముఖ్యంగా వారసత్వ యుద్ధానికి తెరలేచినట్లు స్పష్టమవుతోంది. ఉత్తర కొరియా అధినేత నేత కిమ్ జోంగ్ ఉన్ తదుపరి దేశ పగ్గాలను ఎవరికి అప్పగించనున్నారు అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ, దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) కీలక విషయాలను వెల్లడించింది. కిమ్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏను తన రాజకీయ వారసురాలిగా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం కిమ్ కుటుంబంలో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. కుమార్తెకు పగ్గాలు అప్పగిస్తే, ఇన్నాళ్లూ దేశంలో నంబర్ టూ స్థానంలో కొనసాగుతున్న కిమ్ సొంత సోదరి కిమ్ యో జోంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, తద్వారా దేశంలో (North Korea) అత్తా-మేనకోడళ్ల మధ్య తీవ్రమైన అధికార పోరు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ తర్వాత రెండో అత్యంత శక్తిమంతమైన నాయకురాలిగా విశేష గుర్తింపు పొందారు. పాలక కొరియా వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీలో అత్యంత కీలకమైన, సీనియర్ హోదాలో ఆమె కొనసాగుతున్నారు. అన్న కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయంపై ఆమె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. పాలనా యంత్రాంగంతో పాటు శక్తిమంతమైన మిలిటరీలోనూ ఆమెకు బలమైన పట్టు, మద్దతు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై ఆమె తరచూ విరుచుకుపడుతుంటారు. 2022లో దక్షిణ కొరియా రక్షణ మంత్రిని టార్గెట్ చేస్తూ తమ జోలికి వస్తే దక్షిణ కొరియా వినాశనం తప్పదంటూ ఆమె చేసిన ఘాటైన హెచ్చరికలు తీవ్ర సంచలనం సృష్టించాయి. వాస్తవానికి కిమ్ జోంగ్ ఉన్‌కు అనారోగ్య కారణాల వల్ల లేదా హఠాత్తుగా మరేదైనా జరిగితే, దేశ (North Korea) అత్యున్నత నాయకత్వ బాధ్యతలను కిమ్ యో జోంగ్ తీసుకుంటారని గతంలో బలంగా అంచనాలు వెలువడ్డాయి. ఆమె అధికార పగ్గాలు చేపట్టడానికి మానసికంగా, రాజకీయంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నారని దక్షిణ కొరియా మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం విశ్లేషించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కానీ అనూహ్యంగా 2022లో కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసి సమీకరణాలను మార్చేశారు. నాటి నుంచి మిలిటరీ పరేడ్లు, క్షిపణి పరీక్షలు సహా అనేక అత్యంత కీలకమైన అధికారిక కార్యక్రమాలకు తన కుమార్తెను వెంటే తీసుకువెళ్తున్నారు. దేశంలోని (North Korea) అత్యంత కఠినమైన పురుషాధిక్య భావజాలం నేపథ్యంలో ఒక బాలికకు అధికారం దక్కకపోవచ్చని దక్షిణ కొరియా నిఘా సంస్థ మొదట భావించింది. కానీ ప్రభుత్వ మీడియాలోనూ, సభల్లోనూ ఆమెకు దక్కుతున్న అత్యున్నత ప్రాధాన్యతను నిశితంగా గమనించిన ఎన్ఐఎస్.. తన అంచనాలను పునఃసమీక్షించుకుంది. కిమ్ జు ఏ వారసురాలిగా ఎదగడం కీలక దశలో ఉందని, భవిష్యత్ నాయకురాలు ఆమేనని స్పష్టం చేసింది. కిమ్ వంశపారంపర్య పాలనను కొనసాగించే దిశగా.. ఈ నెలాఖరులో జరగనున్న వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో కిమ్ తన వారసత్వ ప్రణాళికపై అధికారికంగా పార్టీ ఆమోదముద్ర వేయించుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటిస్తే, దశాబ్ద కాలంగా అన్నకు కుడిభుజంగా ఉంటూ అధికారంపై ఆశలు పెంచుకున్న కిమ్ సోదరి యో జోంగ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కిమ్ రాజ్యంలో (North Korea) ముదురుతున్న ఈ కుటుంబ వారసత్వ పోరు ఉత్తర కొరియా భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తుందో వేచి చూడాల్సిందే.













