CATS: క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ నూతన అధ్యక్షుడిగా పార్థ బైరెడ్డి ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని (నార్తర్న్ వర్జీనియా, మేరీల్యాండ్) తెలుగు వారికి సేవలందిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ’ (CATS) 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సంస్థ అధ్యక్షుడిగా పార్థ బైరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు.
తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణే ధ్యేయం
2005 నుండి డీసీ మెట్రో ప్రాంతంలో తెలుగు భాష, కళలు, సంస్కృతిని ప్రోత్సహించడంలో క్యాట్స్ కీలక పాత్ర పోషిస్తోందని పార్థ బైరెడ్డి గుర్తు చేశారు. రాబోయే తరానికి తెలుగును అందించాలనే లక్ష్యంతో క్రమం తప్పకుండా తరగతులు, శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండుగలు, నృత్యం, సంగీతం, క్రీడల ద్వారా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ సంస్థ కృషి చేస్తోంది.హెల్త్ క్యాంపులు, ఫుడ్ డ్రైవ్స్ వంటి స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను చాటుకుంటోంది.
పూర్వ అధ్యక్షుల స్ఫూర్తితో ముందడుగు
గత అధ్యక్షుల విజన్, అంకితభావం సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని, వారి అడుగుజాడల్లో నడుస్తూ సంస్థను మరింత ముందుకు తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. దాతలు, సభ్యుల సహకారంతో మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
ఆర్థిక బలం.. సభ్యుల సహకారం
సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడానికి సభ్యులు, దాతలే వెన్నెముక అని పార్థ బైరెడ్డి కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారాన్ని అందిస్తూ, క్యాట్స్ సంస్థను తెలుగు సంస్కృతికి ఒక ప్రామాణిక వేదికగా (Standard-bearer) ఉంచాలని కోరారు. కమిటీ సభ్యులు, వాలంటీర్ల అద్భుతమైన ప్రణాళిక, టీమ్ వర్క్లాగా కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చివరగా, తెలుగు వారందరూ క్యాట్స్ (CATS) లో సభ్యత్వం తీసుకుని సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






