NBFC: ముత్తూట్ ఫైనాన్స్ సరికొత్త చరిత్ర.. రూ. 7,209 కోట్ల రికార్డు లాభం!

Muthoot Finance: ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ తన ఆర్థిక ఫలితాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. డిసెంబర్ 31, 2025తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి (9M FY26) కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated PAT) ఏకంగా 84% పెరిగి రూ. 7,209 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ. 3,908 కోట్లు మాత్రమే.
ఆర్థిక ఫలితాలు:
రుణ ఆస్తుల (AUM) జోరు: ముత్తూట్ గ్రూప్ నిర్వహణలో ఉన్న మొత్తం రుణ ఆస్తులు (Consolidated AUM) 48% వార్షిక వృద్ధితో రూ. 1,64,720 కోట్లకు చేరాయి.
బంగారు రుణాల రికార్డు: కంపెనీ ప్రధాన వ్యాపారమైన గోల్డ్ లోన్ విభాగం అపూర్వమైన వృద్ధిని కనబరిచింది. బంగారు రుణాల ఏయుఎం రూ. 1,39,658 కోట్లకు చేరుకుని, 50% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
స్టాండలోన్ లాభం: కేవలం ముత్తూట్ ఫైనాన్స్ స్టాండలోన్ లాభమే 91% పెరిగి రూ. 7,048 కోట్లుగా నిలిచింది. ఇది ఏ సంవత్సరంలోనైనా మొదటి తొమ్మిది నెలల కాలానికి అత్యధికం.
నెట్వర్క్ విస్తరణ: గ్రూప్ మొత్తం బ్రాంచ్ నెట్వర్క్ 7,541కి చేరుకుంది.
ఇవి కూడా చదవండి
మేనేజ్మెంట్ స్పందన:
ఫలితాల వెల్లడి సందర్భంగా ముత్తూట్ గ్రూప్ చైర్మన్ శ్రీ జార్జ్ జాకబ్ ముత్తూట్ మాట్లాడుతూ.. “కేంద్ర బడ్జెట్ 2026లోని సానుకూల అంశాలు, ఆర్బీఐ రేట్ల తగ్గింపులు, పెరిగిన వినియోగం వల్ల క్రెడిట్ డిమాండ్ పెరిగింది. మా 7,500 పైగా శాఖలు, 50,000 మంది ఉద్యోగుల కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైంది” అని తెలిపారు.
మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ మాట్లాడుతూ.. “పండుగ సీజన్ కావడంతో బంగారు రుణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అధిక బంగారం ధరలు కస్టమర్ల రుణ సామర్థ్యాన్ని పెంచాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు, నిపుణుల నుండి ఆదరణ లభిస్తోంది” అని పేర్కొన్నారు.
గణాంకాలు :
లాభాల్లో రెట్టింపు వృద్ధి: గత ఏడాది ఇదే మూడు నెలల కాలంలో (Q3 FY25) కంపెనీ లాభం రూ. 1,392 కోట్లుగా ఉండగా, ఈసారి అది 103% పెరిగి రూ. 2,823 కోట్లకు చేరింది. అంటే లాభం ఏకంగా రెట్టింపు అయ్యింది.
పెరిగిన రుణ ఆస్తులు: కంపెనీ ఇచ్చిన మొత్తం రుణాల విలువ (Loan Assets) గతేడాది రూ. 1,11,308 కోట్లుగా ఉంటే, ఇప్పుడు అది 48% వృద్ధితో రూ. 1,64,720 కోట్లకు చేరుకుంది.
ఈ ఫలితాలతో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.











































































