PAKvsNAM: ఫర్హాన్ సెంచరీ.. నమీబియాను చిత్తుచేసి సూపర్-8కు పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానం వేదికగా జరిగిన గ్రూప్-ఎ 35వ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ (PAKvsNAM) జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. పసికూన నమీబియాపై ఏకంగా 102 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి దర్జాగా సూపర్-8 (Super 8) దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నమీబియాకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో గ్రూప్-ఎ నుంచి ముందడుగు వేసిన జట్లలో పాకిస్థాన్ స్థానం ఖరారైంది.
ఈ మ్యాచ్‌లో (PAKvsNAM) టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఎలాంటి సంకోచం లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14) త్వరగానే వెనుతిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 58 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతనికి తోడుగా కెప్టెన్ సల్మాన్ అఘా 23 బంతుల్లో 38 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. షాదాబ్ కేవలం 22 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో పాకిస్థాన్ దాదాపు 10 రన్‌రేట్‌తో 199 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. నమీబియా (PAKvsNAM) బౌలర్లలో జాక్ బ్రాసెల్ 4 ఓవర్లలో 48 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 25 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా (PAKvsNAM) జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. పాక్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు నమీబియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నిర్ణీత 20 ఓవర్లు కూడా పూర్తి చేయకుండానే.. కేవలం 17.3 ఓవర్లలో 97 పరుగులకే నమీబియా ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఓపెనర్ లౌరెన్ స్టీన్‌క్యాంప్ (22 బంతుల్లో 23 పరుగులు), అలెగ్జాండర్ వోల్షెంక్ (20 బంతుల్లో 20 పరుగులు) మాత్రమే క్రీజులో కాసేపు నిలబడగలిగారు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (7), జేజే స్మిత్ (9), జాన్ ఫ్రైలింక్ (9), జేన్ గ్రీన్ (7) ఇలా టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. పాక్ స్పిన్నర్ల (PAKvsNAM) ధాటికి వారు బౌండరీలు కొట్టడం కాదు, కనీసం వికెట్లు కాపాడుకోలేకపోయారు.
పాకిస్థాన్ (PAKvsNAM) బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ అద్భుతమైన స్పెల్‌తో నమీబియాను శాసించాడు. కేవలం 3.3 ఓవర్లు వేసి ఒక మెయిడిన్‌తో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అలాగే స్టార్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి నమీబియా నడ్డి విరిచాడు. పేసర్ సల్మాన్ మీర్జా, స్పిన్నర్ మహ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. పరుగులపరంగా (102 పరుగుల తేడా) టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌కు ఇది ఒక చిరస్మరణీయమైన భారీ విజయం. తన అజేయమైన 100 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించిన పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (Player of the Match) అవార్డు దక్కింది.













