BR Naidu: ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: బీఆర్ నాయుడు
కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయన వైసీపీ నేతలు, హెరిటేజ్ (Heritage) పై ఆరోపణలు చేయడం దుర్మార్గమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ సంస్థ ఎప్పుడూ టీటీడీ (TTD)కి నెయ్యి సరఫరా చేయలేదని, ఇది నిప్పులాంటి నిజమని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నెయ్యి సరఫరాలో హెరిటేజ్ పాత్ర లేదు. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనుకోవడం మీ భ్రమ. మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అని చెప్పి పరువు పోగొట్టుకున్నారు. జగన్ చెప్పినట్లు ఆడకుండా మాట్లాడే ముందు విజ్ఞతతో వ్యవహరించండి. నెయ్యి ధరలపైనా వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని అన్నారు.

ఓపెన్ టెండర్ల పారదర్శకంగా వీటిని నిర్ణయించాం. మా పాలకవర్గం రాగానే మొదటగా మేం స్వామి వారి అన్న ప్రసాదాల నాణ్యతలో రాజీపడకూడదని నిర్ణయించుకున్నాం. తక్కువ ధరలకు సరకులు కొని స్వామి వారికి నాణ్యత లేని నైవేద్యాలు, భక్తులకు అన్న ప్రసాదాలు అందించడమేంటి? ఈ విషయంలో మేం రాజీపడే ప్రసక్తే లేదు. నెయ్యి ఒక్కేటే కాదు అన్ని రకాల పదార్థాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పెంచాం. స్వామివారికి సమర్పించే వాటిలో డబ్బు ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు వేసుకోం. ఇదంతా ఆయన సొమ్మే. దేవదేవుని సొమ్ముని నైవేద్యాలకు, అన్న ప్రసాదాలకే వాడే అంశంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదు అని అన్నారు.
ఇవి కూడా చదవండి













