Blinkit: ఆన్లైన్లో చాకులు అమ్మకం.. బ్లింకిట్‌పై క్రిమినల్ కేసు నమోదు
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్లింకిట్’ (Blinkit)పై ఢిల్లీ పోలీసులు ఆయుధ చట్టం (Arms Act) కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. తమ డెలివరీ యాప్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రమాదకరమైన ‘బటన్ కత్తులను’ (Button Knives) విక్రయిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన రెండు వేర్వేరు దారుణ హత్యలు ఈ కేసుకు దారితీశాయి. ఆ రెండు హత్యల్లోనూ దుండగులు నేరానికి ఉపయోగించింది బ్లింకిట్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన బటన్ కత్తులనే అని పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఇది భద్రతా పరంగా తీవ్ర ఆందోళన కలిగించే అంశం కావడంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమై విచారణ వేగవంతం చేశారు. దీనికి తోడు సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పట్టుబడిన ఓ యువకుడిని విచారించగా, తానూ ఆ బటన్ కత్తిని బ్లింకిట్ (Blinkit) ద్వారానే ఆర్డర్ చేసినట్లు అంగీకరించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆయుధ చట్టం నిబంధనల ప్రకారం కత్తుల విక్రయాలకు సంబంధించి కచ్చితమైన సైజు పరిమితులు ఉన్నాయి. 7.62 సెం.మీ పొడవు, 1.72 సెం.మీ వెడల్పు గల బ్లేడ్లు ఉన్న ఫోల్డింగ్ పాకెట్ చాకులను మాత్రమే ఆన్లైన్లో విక్రయించాలి. కాగా నిందితులు వినియోగించిన చాకులు 8సెం.మీ పొడవు, 2.5సెం.మీ వెడల్పుతో ఉన్నాయి. ఇలాంటి కత్తులను అనుమతి లేకుండా విక్రయించినందుకు బ్లింకిట్‌పై (Blinkit) క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎటువంటి లైసెన్స్ లేదా కొనుగోలుదారుడి వయస్సు ధృవీకరణ (Age Verification) లేకుండా యాప్‌లలో నిషేధిత ఆయుధాలు నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరుతుండటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజా భద్రతను పణంగా పెట్టినందుకు బ్లింకిట్ (Blinkit)యాజమాన్యంతో పాటు, వస్తువులను సరఫరా చేస్తున్న వెండర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.













