Rishi Sunak: భారత్‌లో ఏఐపై భయం లేదు.. పశ్చిమ దేశాల్లో టెన్షన్ ఉంది: రిషి సునక్
భారత్‌లో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సదస్సు కోసం దిల్లీకి వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ (Rishi Sunak).. కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రపంచవ్యాప్తంగా ఏఐపై భిన్నమైన వైఖరులు ఉన్నాయని అన్నారు. ‘‘భారత్ వంటి దేశాలు ఈ సాంకేతిక పురోగతిపై విశ్వాసంతో, ఆశావాదంతో ఉన్నాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో ఆందోళన, భయం కనిపిస్తోంది’’ అని చెప్పారు.
ఈ అంతరాలను విధాన నిర్ణయాల ద్వారా తగ్గించవచ్చని, ప్రజల్లో ఉన్న ఆందోళనలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సునక్ (Rishi Sunak) సూచించారు. సాంకేతికత వేగంగా మారుతున్నప్పటికీ, ప్రజలు దాన్ని అర్థం చేసుకునే విధానం ప్రాంతాలను బట్టి మారుతుందని వివరించారు. లేబర్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం గురించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘ఏఐ వల్ల లేబర్ మార్కెట్ పూర్తిగా మారిపోతోంది. కొన్ని ఉద్యోగాలు పూర్తిగా అంతరించవచ్చు, మరికొన్ని ఉద్యోగాల్లో పెద్ద మార్పులు వస్తాయి’’ అని చెప్పారు.

అయితే చరిత్రలో పరివర్తనలను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన సమాజాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఆయన (Rishi Sunak) గుర్తుచేశారు. ఏఐ మన రోజువారీ జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతోందని కూడా పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ స్పందన వచ్చింది. అందుకే ఒక రోజు అదనంగా పొడిగించారు.
ఇవి కూడా చదవండి













