Murder Case: డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్య ప్రమేయం?
మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) తాజాగా దాఖలు చేసిన అడిషనల్ ఛార్జ్ షీట్ లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. ఈ దారుణ హత్యలో అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ (రోజా) పాత్ర కూడా ఉన్నట్టు సిట్ అభియోగాలు నమోదు చేసింది.
ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇన్నాళ్లూ కేవలం అనంతబాబు చుట్టూనే తిరిగిన దర్యాప్తు, ఇప్పుడు ఆయన భార్య లక్ష్మీదుర్గ వైపు మళ్లింది. సిట్ విచారణలో ఆమె కేవలం సాక్షి మాత్రమే కాదని, ఈ నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రెండో నిందితురాలు (A-2) అని తేలింది. సుబ్రహ్మణ్యం గతంలో అనంతబాబు దంపతుల వద్ద ఆరేళ్ల పాటు నమ్మకస్తుడైన డ్రైవర్‌గా పనిచేశారు. తన పెళ్లి కోసం అనంతబాబు నుంచి రూ.50 వేలు అప్పు తీసుకోగా, అందులో రూ. 30 వేలు తిరిగి చెల్లించారు. మిగిలిన రూ. 20 వేల విషయంలో అనంతబాబు దంపతులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. ఉద్యోగం మానేసిన తర్వాత కూడా ఆ డబ్బు కోసం సుబ్రహ్మణ్యాన్ని, ఆయన కుటుంబాన్ని పదేపదే వేధించేవారు. 2022 మే 19న అనంతబాబు పుట్టినరోజు కావడంతో, అదే రోజు సుబ్రహ్మణ్యాన్ని అంతం చేయాలని పథకం పన్నినట్లు సిట్ గుర్తించింది.
హత్య జరిగిన రాత్రి లక్ష్మీదుర్గ పాత్రపై సిట్ సేకరించిన సాంకేతిక ఆధారాలు ఆమెను బుక్ చేశాయి. హత్యకు ముందు రాత్రి 10:20 గంటల సమయంలో లక్ష్మీదుర్గ తమ అపార్ట్మెంట్ సెల్లార్‌లోని వాచ్‌మన్ గదికి వెళ్లి పెద్ద కర్ర కావాలని అడిగారు. వాచ్‌మన్ కుమార్తె లేదని చెప్పినా, బలవంతం చేసి ఏదో ఒక కర్ర తీసుకురావాలని ఒత్తిడి చేసినట్లు సాక్ష్యాలు లభించాయి. తాను ఆ సమయంలో ఆసుపత్రిలో బంధువులను పరామర్శించడానికి వెళ్లానని ఆమె గతంలో పోలీసులకు అబద్ధం చెప్పారు. కానీ, సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణలో ఆమె ఆసుపత్రికి వెళ్లలేదని, హత్య జరిగిన సమయంలో అనంతబాబుతో పాటే ఉన్నారని తేలింది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వాహనంలో తరలించే సమయంలో కూడా ఆమె అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా లక్ష్మీదుర్గ క్రియాశీలకంగా వ్యవహరించారు. సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి ‘రోడ్డు ప్రమాదం’ జరిగిందని నమ్మించే ప్రయత్నంలో భర్తకు సహకరించారు. నేరం జరిగిన తర్వాత రక్తపు గుర్తులను చెరపడం, ఆధారాలను మాయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని సిట్ తన అదనపు ఛార్జిషీట్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి
గత ప్రభుత్వ హయాంలో ఈ కేసులో కేవలం అనంతబాబును మాత్రమే నిందితుడిగా చూపి, ఇతర కీలక సాక్ష్యాలను పోలీసులు వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధితుడి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సిట్ ఏర్పాటు చేశారు. శాస్త్రీయ దర్యాప్తు, ఫోరెన్సిక్ విశ్లేషణల ద్వారా పోలీసులు ఈ కుట్రలోని లోతుపాతులను బయటకు తీశారు. ఈ కేసులో A2 లక్ష్మీదుర్గపై హత్య, హత్యకు ప్రేరేపించడం, ఆధారాల ధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పోలీసు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఒక సామాన్య డ్రైవర్‌ను అత్యంత కిరాతకంగా చంపి, దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్సీతో పాటు ఆయన భార్య కూడా భాగస్వామి కావడం వ్యవస్థలోని నైతిక పతనానికి అద్దం పడుతోంది. సిట్ సమర్పించిన ఈ పక్కా ఆధారాలు బాధితుడి కుటుంబానికి న్యాయం చేకూరుస్తాయని ఆశించవచ్చు.
ఇవి కూడా చదవండి













