AP Assembly: ఏపీ అసెంబ్లీముందు ఈ స్టాల్స్ చూసారా..?
చేనేత ఉత్పత్తులతో పాటుగా ఇకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోన్న ఏపీ సర్కార్(Ap Govt).. ఇప్పుడు తాజాగా చేనేత ఉత్పత్తుల కోసం ఓ కీలక అడుగు వేసింది. అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేసింది. 19వ తేదీ నుంచి ఆప్కో(APCO) ఆధ్వర్యంలో 12 చేనేత స్టాళ్లు ప్రారంభించనుంది ఏపీ సర్కార్. బడ్జెట్ సమావేశాల ముగిసే వరకూ స్టాళ్ల నిర్వహణ ఉంటుందని తెలిపింది ఏపీ సర్కార్. స్టాళ్ల ద్వారా ప్రఖ్యాత గాంచిన చేనేత వస్త్రాలను విక్రయిస్తోంది. అమ్మకానికి పొందూరు షర్ట్ లు పంచెలు, కండువాలను ఉంచారు.
మాధవవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, బందరు పట్టు చీరలు కూడా విక్రయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 లో ఏర్పాటైన దగ్గరి నుంచి.. చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే విధంగా.. ఎగ్జిబిషన్లు, బజార్లు, వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే పండగ సమయాల్లో భారీ డిస్కౌంట్లు అందిస్తూ.. చేనేత వస్త్రాల వినియోగం పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక అడుగులు వేసింది.
ఏపీ బడ్జెట్ సమావేశాల(Ap Budget Session) సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయించింది. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అసెంబ్లీకి, శాసనమండలికి వచ్చి.. వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం నుంచి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ ఆప్కో ఆధ్వర్యంలో 12 స్టాళ్లను చేనేత, జౌళి శాఖాధికారులు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో తయారవుతున్న ప్రఖ్యాతగాంచిన చేనేత ఉత్పత్తులను ఈ స్టాళ్లలో విక్రయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు అడుగులు వేస్తోంది. సాధారణ చీరలతో పాటు ఇంటిళ్లపాది వినియోగించుకునే రెడీమేడ్ దుస్తులను కూడా ఈ స్టాల్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అదే విధంగా లుంగీలు, టవళ్లు, దుప్పట్లు, ఇతర చేనేత వస్త్రాలను సైతం అమ్మకానికి పెట్టారు. గురువారం ఈ స్టాల్స్ ను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అటు సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులు కూడా వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం ఉంది.













