Flight: చార్టెడ్ ఫ్లైట్ లో ఐఏఎస్ ఆఫీసర్.. అసెంబ్లీని ఊపేస్తున్న వ్యవహారం..!
చార్టెడ్ ఫ్లైట్ ల వ్యవహారం ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారుతోంది. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫ్లైట్స్ పై చర్చలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ ఐఏఎస్(IAS) ఆఫీసర్ ఇలాగే సంచలనం అయింది. బీహార్ కేడర్ కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు. ఒక ఐఏఎస్ అధికారి తన కుటుంబాన్ని చార్టెడ్ ఫ్లైట్ లో ఏ విధంగా తీసుకెళతారు అనే ప్రశ్నలు ఇప్పుడు అక్కడి రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
చివరకు ఇది కుల రాజకీయాలకు దారి తీసి.. బీహార్ – ఢిల్లీ(Delhi) మధ్య విమర్శలకు కేంద్రంగా మారింది. ఐఏఎస్ అధికారి నీలేష్ రామచంద్ర దేవోర్ చార్టర్డ్ విమానంలో తమ కుటుంబాన్ని తీసుకెళ్ళారు. అసలు ఒక ఐఏఎస్ అధికారి ఆ ఖర్చును ఎలా భరిస్తారని, దానికి ఎవరు డబ్బు చెల్లించారని ప్రతిపక్షాలు నిలదీశాయి. దేవోర్ గత సంవత్సరం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నుండి పాట్నాకు చార్టర్డ్ విమానంలో ప్రయాణించారు. అయితే అది బిజెపి – జేడీయు విమానం అని.. ఢిల్లీ నుంచి పాట్నాకు వస్తుంటే ఆయన ఆ ఫ్లైట్ ఎక్కారని ప్రభుత్వం చెప్తోంది.
ఇక దీనిపై బీహార్ మంత్రి అశోక్ సంచలన కామెంట్స్ చేసారు. ఆయన ఒక దళితుడు అని.. దళితుడికి చార్టెడ్ విమానంలో ప్రయాణించే హక్కు లేదా అంటూ కొత్త చర్చకు తెరలేపారు. సోమవారం బీహార్ శాసనసభలో ఈ వివాదం ప్రారంభమైంది. నీలేష్ రామచంద్ర దేవర్ గత ఏడాది జూన్ లో ఢిల్లీ నుండి పాట్నాకు తన కుటుంబంతో కలిసి చార్టర్డ్ విమానంలో ప్రయాణించారని ఆర్జేడీ ఎమ్మెల్యే రాహుల్ శర్మ విమర్శలు చేసారు. ఒక ఐఏఎస్ అధికారి అంత ఖర్చు అయ్యే విమానాన్ని ఏ విధంగా భరిస్తారని రాహుల్ శర్మ ప్రశ్నించారు.
జూన్ 5, 2025న, చార్టర్డ్ కింగ్ ఎయిర్ ఫాల్కన్ 2000 విమానం ఢిల్లీ నుండి పాట్నాకు చేరుకుందని, ఆ విమానం.. సాధారణ విమానాశ్రయంలో పార్కింగ్ చేయలేదు కానీ ఒక ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్కు వెళ్లిందని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పౌర విమానయాన కార్యదర్శి నీలేష్ డియోర్, తాను గత జూలైలో పాట్నా నుండి ఢిల్లీకి అధికారిక పర్యటనలో భాగంగా వెళ్లామని, విమానం ఎలాగైనా పాట్నాకు తిరిగి రావాలని.. తిరుగు ప్రయాణంలో అందులో ఐఏఎస్ అధికారి.. అతని కుటుంబం ప్రయాణం చేసారని ఆయన పేర్కొన్నారు.













