T20 World Cup: డక్కాభిషేకం, కలవరపెడుతోన్న యువ ఆటగాడు..!
టీం ఇండియా క్రికెట్ చరిత్రలో.. కృష్ణమాచారి శ్రీకాంత్, గంగూలి, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ(Rohith Sharma) వంటి ఎందరో హిట్టర్లను చూసింది గాని.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) లాంటి ఆటగాడిని చూడలేదు. టి20 ఫార్మాట్ లో అతనికి తిరుగులేదు.. అతనిని మించి ఆడిన ఆటగాడు లేడు.. ఇది మొన్నటి వరకు ఉన్న అభిప్రాయం. కానీ గత 20 రోజులుగా ఈ యువ సంచలనాన్ని చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ ను ఓ విషయం వెంటాడుతోంది. టి20 ఫార్మాట్ లో సూర్య కుమార్ యాదవ్(Surya kumar Yadav) వారసుడిగా చూస్తున్న అభిషేక్ ఆట ఆందోళన కలిగిస్తోంది.
మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో రాటుదేలిన ఈ యువ పంజాబీ శర్మ గారిపై టి20 ప్రపంచకప్ లో భారీ అంచనాలు ఉన్న మాట వాస్తవం. అతనిపైనే టీం ఇండియా అభిమానులు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. కానీ ఈ టోర్నీలో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అంచనాలకు మించి రాణిస్తాడు అనే నమ్మకం ఉన్న ఈ ప్లేయర్.. కనీసం సాధారణ ఆట తీరును కూడా కనబరచడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వరుసగా మూడు మ్యాచ్ లలో అతను డకౌట్ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మొన్న పాకిస్తాన్ తో మ్యాచ్ లో అభిషేక్.. ఓ రేంజ్ లో రాణిస్తాడు అని.. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో దుమ్మురేపుతాడు అని అంచనా వేసారు. కానీ డకౌట్ అయ్యాడు. ఇప్పుడు అతని టెక్నిక్ ను ప్రత్యర్ధులు పట్టేశారు అనే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. పవర్ ప్లే లో ఫాస్ట్ బౌలర్ లను ఉతికి ఆరేసే అభిషేక్.. స్పిన్ లో మాత్రం బొక్క బోర్లా పడుతున్నాడు. ఈ వీక్నెస్ ను పట్టిన పాకిస్తాన్.. అతనిని తొలి ఓవర్ లోనే కట్టడి చేసింది. తాజాగా నెథర్లాండ్స్ కూడా అలాగే బుట్టలో వేసింది. ఓ పక్క ఇషాన్ కిషన్.. దూకుడుగా ఆడుతుంటే అభిషేక్ మాత్రం వరుసగా ఫెయిల్ కావడం ఆందోళన కలిగిస్తోంది.













