Abhishek Sharma: ఫామ్‌లో లేని అభిషేక్‌కు సునీల్ గవాస్కర్ సలహా
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్నా కూడా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్ మాత్రం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ డకౌట్‌గా వెనుదిరగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ మెగా టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఈ డాషింగ్ బ్యాటర్.. ప్రపంచకప్ వేదికపై ఖాతా తెరవడానికి కష్టపడుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు అభిషేక్‌కు సునీల్ గవాస్కర్ సలహా (Sunil Gavaskar) ఇచ్చారు.
అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రస్తుత పరిస్థితులపై గవాస్కర్ స్పందిస్తూ.. “అభిషేక్ శర్మకు నేను ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏంటంటే.. అతను క్రీజులోకి వెళ్ళగానే మొదటి బంతికి సింగిల్ తీయాలి. కేవలం ఒక్క పరుగు తీస్తే చాలు. అది అతనికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సింగిల్ తీస్తే అభిషేక్ కాళ్లు కూడా చురుగ్గా కదులుతాయి. ఆ తర్వాత అతను తన సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించవచ్చు. కానీ తొలి బంతికే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవద్దు” అని సూచించారు. అభిషేక్ (Abhishek Sharma) ఇటీవల న్యూజిలాండ్‌పై అద్భుతమైన సెంచరీతో రాణించాడని, అతని దగ్గర టాలెంట్ ఉందని, కేవలం ఆ ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవడంలోనే తడబడుతున్నాడని సన్నీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఈ టోర్నీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేవలం ఆటకే పరిమితం కాలేదు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన తర్వాత, అతను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో నమీబియాతో జరిగిన రెండో మ్యాచ్‌కు అతను దూరం కావాల్సి వచ్చింది. చివరకు పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటికీ, నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్గానే వెనుదిరిగారు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ సున్నాకే అవుట్ అయిన ఆశిష్ నెహ్రా వంటి ఆటగాళ్ల సరసన అభిషేక్ (Abhishek Sharma) నిలిచారు. ఈ గణాంకాలు అతడిపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో గవాస్కర్ ఇచ్చిన ‘సింగిల్’ మంత్రం ఎంతో విలువైనదని విశ్లేషకులు భావిస్తున్నారు.
నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్.. ఇప్పటికే సూపర్-8కు చేరిన భారత్‌కు ప్రాక్టీస్ లాంటిదే. అయితే అభిషేక్ శర్మకు మాత్రం ఇది అగ్నిపరీక్ష. ఈ మ్యాచ్‌లో గనుక అతను రాణించకపోతే సూపర్-8 దశలో తుది జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి.. సన్నీ చెప్పినట్లుగా మొదట క్రీజులో కుదురుకుని ఆ తర్వాత తన విధ్వంసాన్ని మొదలుపెడితే అభిషేక్ (Abhishek Sharma) మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఖాయం. భారత అభిమానులు కూడా తమ యువ హీరో నుంచి ఒక భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి













