Heritage: జగన్ కు హెరిటేజ్ లీగల్ నోటీస్
దాదాపు 20 రోజుల నుంచి తమ సంస్థను, వైసీపీ(YSRCP), ఆ పార్టీ నేతలు టార్గెట్ చేయడంపై హెరిటేజ్ సంస్థ(heritage Foods) ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు గానూ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) కు లీగల్ నోటీసులు జారీ చేసింది హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌పై ఉద్దేశపూర్వకంగా, పునరావృతంగా మరియు రాజకీయ దురుద్దేశంతో సాగిన అసత్య, తప్పుదారి పట్టించే మరియు పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.
దేశవ్యాప్తంగా మూడు దశాబ్దాలకు పైగా నాణ్యత, పారదర్శకత, వినియోగదారుల నమ్మకంపై నిలబడ్డ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో, ప్రెస్మీట్లు నిర్వహించి, వాటిని ఆధారంగా చేసుకుని వార్తలు ప్రచురించడం నిజాలను వక్రీకరించిన తీవ్రమైన దుష్ప్రచారమే అంటూ సంస్థ మండిపడింది. టీటీడీ నెయ్యి సరఫరా, కల్తీ, కుట్రలు, “సిండికేట్” వంటి పదాలతో హెరిటేజ్ ఫుడ్స్‌ను నేర సంస్థలా చిత్రీకరించడం పూర్తిగా అసత్యం, ఆధారరహితం మరియు చట్టవిరుద్ధమని ఆరోపించింది.
![]()
ప్రజలను ఉద్దేశపూర్వకంగా మభ్యపెట్టేందుకు, కంపెనీ పరువును కూల్చివేయాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేయబడ్డాయని లీగల్ నోటీసులో ప్రస్తావించింది హెరిటేజ్. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ఇతర సంస్థలతో ఉన్న సంబంధాలు పూర్తిగా చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాల పరిధిలోనే ఉన్నాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, అక్రమ కుమ్మక్కులున్నట్టు ప్రచారం చేయడం ఘోరమైన అబద్ధ ప్రచారమని స్పష్టం చేసింది. వైఎస్ జగన్, వారి పార్టీ నేతలు చేసిన తప్పుడు, దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజల ముందే షరతుల్లేని బహిరంగ క్షమాపణ ప్రకటించాలని డిమాండ్ చేసింది హెరిటేజ్. తప్పుడు ప్రచారం చేస్తే.. ఏ చర్యలు తీసుకోవడానికి అయినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి













