Iran-USA: ఇరాన్ తో ఓవైపు చర్చలు.. మరోవైపు అమెరికా యుద్ధప్రయత్నాలు..!
అమెరికా ఇరాన్ మధ్య ఓ వైపు చర్చలు..మరోవైపు విమర్శలు, వార్నింగ్స్ కొనసాగుతున్నాయి. అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.24 గంటల్లో దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్ల (USA fighter jets)ను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. దీంతో అగ్రరాజ్యం ఏ క్షణాన ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
చర్చలు విఫలమైతే సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి ఇరాన్‌ను హెచ్చరిస్తున్నారు. జెనీవా వేదికగా ఇరుదేశాల మధ్య జరిగిన రెండో రౌండ్ చర్చలు కూడా ముగిశాయి. ఈ క్రమంలో యూఎస్ తన ఫైటర్జెట్లను పశ్చిమాసియా (Middle East)కు పంపడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. యూఎస్‌కు చెందిన ఎఫ్-22, ఎఫ్-16, ఎఫ్-35 వంటి ఫైటర్ జెట్లతో పాటు గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు మధ్యప్రాశ్చ్యం వైపునకు వెళ్తున్నట్లు కొన్ని ఫ్లైట్ ట్రాకింగ్‌లు కూడా నివేదించాయి.
ఇవి కూడా చదవండి
ఇదిలాఉండగా.. అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (US Aircraft Carrier Gerald R Ford) కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా దిశగా వెళ్తుందని ఓ నేవీ అధికారి తెలిపారు. యుఎస్ఎస్ మహాన్, యూఎస్ఎస్ బెయిన్‌బ్రిడ్జ్, యూఎస్ఎస్ విన్ట్సన్ చర్చిల్ వంటి మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లతో ఇది ప్రయాణిస్తుందని ఆయన వెల్లడించారు. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌తో పాటు పలు యుద్ధ విమానాలను ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించింది.
మరోవైపు.. జెనీవాలో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని అమెరికా, ఇరాన్‌లు పేర్కొన్నాయి. చర్చల్లో పురోగతి సాధించామని.. కొన్ని విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉందని యూఎస్ అధికారులు తెలిపారు. ఓ ఒప్పందం కుదుర్చుకునేందుకు మార్గం సుగుమమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వెల్లడించారు. కాగా.. తాజా చర్చలు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరానియన్లు అంగీకరించడానికి సిద్ధంగా లేని కొన్ని కఠినమైన షరతులను ట్రంప్ నిర్దేశించినట్లు తెలిపారు. యూఎస్ ఇంకా దౌత్యపరమైన పరిష్కారాలనే ఇష్టపడుతుందని అంటూనే.. తమ అధ్యక్షుడి వద్ద మరిన్ని ఎంపికలు ఉన్నాయంటూ హెచ్చరికలు చేశారు.
ఇవి కూడా చదవండి













