ATA: ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిని కలిసిన ఆటా ప్రతినిధి బృందం
హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధి బృందం, ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం ఆహ్వానం మేరకు ఆయనను కలసి, విశ్వవిద్యాలయ అకడమిక్ ప్రగతి, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంపై చర్చించింది. ఈ సమావేశంలో ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షులు పర్మేష్ భీమ్‌రెడ్డి, ట్రస్టీ కాశీ కోత, విద్యా సలహాదారు ప్రొఫెసర్ రాజశేఖర్, ఆటా ఇండియా టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్ని అసోసియేషన్ (OUAA–గ్లోబల్) అధ్యక్షులు హరినాథ్ మేడీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీని ఉస్మానియా యూనివర్సిటీ అలుమ్ని అసోసియేషన్ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఈ. సుజాత సమన్వయం చేశారు. సమావేశంలో ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధిపై తన దృష్టికోణాన్ని వివరించడంతో పాటు, విద్యా నాణ్యతను మరింత పెంపొందించడంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, 2024లో 70కు పైబడిన స్థానం నుంచి 2025 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఓవరాల్ విభాగంలో 53వ స్థానాన్ని ఉస్మానియా యూనివర్సిటీ దక్కించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో 7వ స్థానాన్ని కూడా సాధించినట్లు వెల్లడించారు. అలాగే, బోధనా సిబ్బంది, ల్యాబొరేటరీ సహాయకుల కొరతను ఉపకులపతి గారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత ఖాళీలను భర్తీ చేయడానికి ప్రొఫెసర్లు, ల్యాబ్ అసిస్టెంట్ల నియామకం అత్యవసరమని తెలిపారు. విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం సీఎం సహకారంతో రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను ఉద్దేశించి, ఉస్మానియా ఫౌండేషన్‌కు విరాళాలు అందించి విశ్వవిద్యాలయ విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడాలని ఉపకులపతి కోరారు. విరాళాల వినియోగంలో పూర్తి పారదర్శకత, బాధ్యత ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆటా తరఫున, 2026 జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా అంతర్జాతీయ సదస్సుకు ఉపకులపతిని ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఈ సదస్సులో ఓస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్ నిర్వహించి, విశ్వవిద్యాలయ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి సూచనలు సేకరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతును సమీకరించే అవకాశం కల్పించనున్నారు. అవసరమైన సంస్థాగత అనుమతులు లభిస్తే సదస్సుకు హాజరవుతానని ఉపకులపతి హామీ ఇచ్చారు.






