Mudragada: పవన్‌పై ‘ముద్రగడ’ అస్త్రం..! వంగా గీతకు చెక్..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పుడున్న ప్రాధాన్యత మరే నియోజకవర్గానికి లేదంటే అతిశయోక్తి కాదు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికీ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించి, డిప్యూటీ సీఎం పీఠాన్ని అధిష్టించారు. అయితే, ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. గత ఎన్నికల ఫలితాల నుంచే కొత్త పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్‌ను ఢీకొట్టాలంటే సాదాసీదా వ్యూహాలు పనిచేయవని గ్రహించిన వైసీపీ అధిష్టానం.. ఇప్పటి నుంచే సరికొత్త రాజకీయ చదరంగానికి తెరలేపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వంగా గీతను తప్పించి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో పిఠాపురం రణరంగాన్ని తలపించింది. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని వైసీపీ ఛాలెంజ్ చేసింది. ఆ సమయంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన శపథం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ, ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓటమిని అంగీకరించిన ముద్రగడ.. తాను చేసిన సవాల్‌కు కట్టుబడి తన పేరును ‘పద్మనాభ రెడ్డి’గా మార్చుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయంగా కొంత స్తబ్దత నెలకొన్నా, ఇప్పుడు మళ్లీ వైసీపీ పిఠాపురం కేంద్రంగా ముద్రగడను యాక్టివ్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.
పిఠాపురం బాధ్యతలను ఇప్పటివరకు మాజీ ఎంపీ వంగా గీత చూసుకుంటున్నారు. అయితే, ఆమెను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC)లో వంగా గీతకు చోటు కల్పించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సాధారణంగా నియోజకవర్గ బాధ్యతల్లో ఉన్నవారికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో కీలక పదవులు ఇవ్వడం అరుదు. ఆమెకు పీఏసీలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా.. పిఠాపురం ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఆమెను గౌరవప్రదంగా తప్పించే ప్లాన్ అమలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ వంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే వంగా గీత వంటి సౌమ్యురాలైన నేత సరిపోరని, మరింత దూకుడుగా ఉండే నాయకత్వం అవసరమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
వంగా గీత స్థానంలో పిఠాపురం బాధ్యతలను ముద్రగడ పద్మనాభంకు అప్పగించాలని వైసీపీ యోచిస్తోంది. కాపు సామాజికవర్గంలో ముద్రగడకు ఉన్న పట్టు, పవన్ కల్యాణ్‌పై ఆయనకున్న వ్యక్తిగత వైరం, దూకుడుగా మాట్లాడే తత్వం.. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా వైసీపీ భావిస్తోంది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన స్థాయికి తగ్గ ప్రత్యర్థి ఉంటేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని, క్యాడర్లో జోష్ వస్తుందని పార్టీ లెక్కలు వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే “ఆపరేషన్ పిఠాపురం” బాధ్యతలను ముద్రగడ భుజస్కందాలపై ఉంచాలని చూస్తోంది.
అయితే, ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చాలా కాలమైంది. 2024 ఎన్నికల్లోనే ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన దూరంగా ఉన్నారు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ పిఠాపురం బాధ్యతలు తీసుకోవడానికి, లేదా భవిష్యత్తులో పోటీ చేయడానికి ఆయన అంగీకరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా, వ్యక్తిగత కారణాల దృష్య్టా ఆయన ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి సిద్ధంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవడం ఆషామాషీ కాదని వైసీపీకి గత ఎన్నికల అనుభవం నేర్పింది. అందుకే ఒకటి రెండు అస్త్రాలతో కాకుండా, అందుబాటులో ఉన్న అన్ని వనరులను, సామాజిక సమీకరణాలను ఇప్పటి నుంచే ప్రయోగించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ముద్రగడను తెరపైకి తెస్తోంది. ఒకవేళ ముద్రగడ పోటీకి నిరాకరించినా, కనీసం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ, పవన్‌పై విమర్శల దాడిని పెంచే బాధ్యతను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి పిఠాపురంలో రాజకీయం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కట్టడి చేసేందుకు వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వంగా గీతను పక్కకు తప్పించి, ముద్రగడ వంటి సీనియర్ నేతను అస్త్రంగా మలచుకోవాలనుకుంటున్న వైసీపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? పేరు మార్చుకున్న ముద్రగడ.. ఇప్పుడు పిఠాపురం రాజకీయ రూపురేఖలను మార్చే బాధ్యతను తలకెత్తుకుంటారా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, వచ్చే ఎన్నికల నాటికి పిఠాపురం మరోసారి రసవత్తర పోరుకు వేదిక కాబోతోందన్నది మాత్రం సుస్పష్టం.






