MATA: ఎన్నారై ఆస్తులకు భద్రత కల్పిస్తాం.. మాటా మూడో వార్షికోత్సవం సందర్భంగా మధుయాస్కీగౌడ్
- రవీంద్రభారతిలో ఘనంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) వార్షికోత్సవ వేడుకలు
హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతి వేదికగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) మూడో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలుగు సమాజానికి దిశానిర్దేశం
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ, అమెరికాలో వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న తెలుగు వారు తమ అనుభవాలను, వృత్తి నైపుణ్యాలను మాతృభూమిలోని తెలుగు ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందించాలని సూచించారు. విద్య, ఉపాధి రంగాల్లో కొత్త తరానికి తగిన సలహాలు, సహకారం అందించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎన్నారైలపై ఉందన్నారు. ఎన్నారైల ఆస్తుల రక్షణకు కాంగ్రెస్ పార్టీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
ఘనంగా సాంస్కృతిక ప్రదర్శనలు
‘మాట’ (MATA) అధ్యక్షుడు కిరణ్ దుగ్గిడి మాట్లాడుతూ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 600 మంది విద్యార్థులకు సాఫ్ట్వేర్ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఈ వేడుకలో ప్రముఖ నటుడు శివారెడ్డి తన ప్రదర్శనతో నవ్వులు పూయించగా, పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ‘మాట’ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ కలాల్, ఇండియా సమన్వయకర్త డాక్టర్ విజయభాస్కర్ బొల్లం, మల్లికార్జున రావు బొల్లా, శ్రీధర్ గుడాల మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.






