Munnangi: గురువుపై మమకారం.. ఊరిపై మక్కువ.. డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి(ఎన్ఆర్ఐ) విరాళం
మున్నంగి (కొల్లిపర): అమెరికాలో ప్రసిద్ధ వైద్యుడిగా, తెలుగు కమ్యూనిటీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఎన్నారై డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి తాను చదువుకున్న ఊరిపై, చదువు నేర్పిన గురువుపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. డల్లాస్‌లో స్థిరపడిన ఆయన, గుంటూరు జిల్లా మున్నంగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సొంత నిధులతో ఒక అత్యాధునిక సైన్స్ ల్యాబ్‌ను నిర్మించారు. ఈ ల్యాబ్‌కు పూర్వ ప్రధానోపాధ్యాయులు సంగాపు సాంబశివరావు పేరు పెట్టడం విశేషం. శుక్రవారం జరిగిన ఈ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సంగాపు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. తన వద్ద చదువుకున్న శ్రీనివాస రెడ్డి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తనను గుర్తుపెట్టుకుని, తన పేరు మీద పాఠశాలలో ల్యాబ్ నిర్మించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు ఇలాంటి దాతల సేవలను సద్వినియోగం చేసుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని ఆయన కోరారు.
విద్యార్థులకు స్ఫూర్తిప్రదాత…
మున్నంగి స్కూల్లో 1978 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస రెడ్డి, విద్యార్థులు ప్రయోగాత్మకంగా పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించారు. తాము జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం పాఠశాల కమిటీ, గ్రామస్తులు దాత శ్రీనివాస రెడ్డిని ఘనంగా సత్కరించారు.






