Pawan Kalyan: హామీ ఇచ్చి మరిచిపోలేదు.. 16 నెలల్లో పని చేసి చూపించిన పవన్..
మాటలు చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ తక్కువగా మాట్లాడి, చేతల్లో చేసి చూపించే వారు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరని ఇప్పుడు పలువురు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన శాఖల పరిధిలోని పనులను ఆయన వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గత పదహారు నెలల కాలంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన ఆయన పని తీరుకు స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది.
గత జగన్ ప్రభుత్వం (YSR Government) హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే చాలాచోట్ల కనీస మౌలిక వసతులు లేకుండానే భూములు ఇచ్చారు. దాంతో ఇళ్లు నిర్మించుకున్నవారు రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి ప్రాంతాల్లో కాకినాడ జిల్లా (Kakinada District) గొల్లప్రోలు (Gollaprolu) శివారులో ఉన్న జగనన్న కాలనీ (Jagananna Colony) ఒకటి. ఇది పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency) పరిధిలో ఉంటుంది. ఈ కాలనీకి వెళ్లాలంటే తప్పనిసరిగా పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. కారణం, మధ్యలో సుద్దగెడ్డ వాగు (Suddagedda Stream) ఉండటం. వర్షాకాలంలో వరదలు వస్తే దారి మొత్తం మునిగిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా వంతెన నిర్మించి, ఆ తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉండేది. కానీ అలా జరగలేదు. దాదాపు 2100 మంది ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు. ఇంటి కల నెరవేరినా, బయటకు వెళ్లాలంటే మాత్రం వాగు దాటాల్సిందే. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యల గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. వరదల సమయంలో ఆయన కూడా పడవలోనే కాలనీలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత ప్రజల కష్టాలు ఆయనను తీవ్రంగా కదిలించాయి.
అక్కడే పవన్ కళ్యాణ్ ఒక హామీ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వంతెన నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. మాట ఇచ్చినట్లే, రూ.3 కోట్ల నిధులతో పదహారు నెలల వ్యవధిలో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయించారు. దీంతో కాలనీ వాసుల జీవితాల్లో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు వారు ఎలాంటి భయం లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఆసుపత్రులు, మార్కెట్లు, పాఠశాలలకు సులభంగా చేరుకోగలుగుతున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన వాహనంలో వంతెన మీదుగా ప్రయాణించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ‘థాంక్యూ డిప్యూటీ సీఎం సర్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు పడవలో ప్రయాణించాల్సిన ప్రాంతంలో ఇప్పుడు రోడ్డుమీద సాఫీగా వెళ్తున్నామని వారు చెప్పారు. రాజకీయాలలో కేవలం మాటలకు , హామీలకు పరిమితి కాకుండా పనులతో ప్రజల పట్ల నిబద్ధతను నిరూపించుకోవడం లో పవన్ కళ్యాణ్ భిన్నమైన దారి ఎంచుకున్నారని ప్రజలు అంటున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నేతగా ఆయనకు మరింత గుర్తింపు పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






