Tehran: ప్రజాస్వామ్యం వైపు ఇరాన్ యువత చూపు.. రగులుతున్న గల్ఫ్ దేశం..!
ఇరాన్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు వారాల క్రితం మొదలైన ఆందోళనలు.. ఇప్పుడు కార్చిచ్చులా మారాయి.రాజధాని టెహ్రాన్సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో పదుల సంఖ్యలో మరణించారు. వీరిలో పిల్లలు, భద్రతా సిబ్బందీ ఉన్నారు. 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం రాత్రి పలుచోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్‌లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపేయడంతో బాహ్య ప్రపంచంలో ఆ దేశానికి సంబంధాలు తెగిపోయాయి. అయితే స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను కొంత మంది వినియోగిస్తున్నారు. దేశంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇరాన్ అధికార టీవీ ఛానల్ వార్తలను ప్రసారం చేస్తోంది. అయితే ఆందోళనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
సాయుధ ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టారని అధికారిక టీవీ ఛానల్ వెల్లడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణ శిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మోవహెదీ ఆజాద్ స్పష్టం చేశారు.
ఇరాన్లో ఆందోళనలు చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ‘ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో ఎక్స్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో ఇరాన్‌కు అమెరికా విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘అధ్యక్షుడు ట్రంప్‌తో ఆటలాడొద్దు. ఆయన ఎప్పుడైనా ఏదైనా చెబితే ఏదో ఒకటి చేస్తారు’ అని స్పష్టంచేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ వాటిని లెక్కచేయడం లేదు. నిరసనలను అణచివేసేందుకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.
ఇరాన్లో నిరసనకారులపై కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఆ దేశం సమస్యల్లో ఉంది. ఎవరూ ఊహించని నగరాల్లో ప్రజలు నియంత్రణ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. మేం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలుపెడితే మేం జోక్యం చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పా’ అని పేర్కొన్నారు.






